
భాషలు వేరైనా భావాలు ఒక్కటే
మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే
దారులు వేరైనా ప్రేమ మార్గం ఒక్కటే
నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు
నీ జ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను
నువ్వు తప్ప!
ఓ ప్రియతమా,
నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి..
నీ రూపం లేని స్వప్నం లేదు నా కనులకి..
నీ భావం లేని కవిత లేదు నా కలానికి..
ప్రేమంటే త్యాగం.. ప్రేమంటే ఇచ్చిపుచ్చుకోవడం.. ప్రేమంటే నమ్మకం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భావాలు.. భావనలు.. ఎన్నో కలలు.. కవితలు.. ఓ ముక్కలో చెప్పాలంటే.. అప్పుడే రెక్కలు తొడిగిన పక్షిలా స్వేచ్ఛగా గాల్లో ఎగురుతున్న ఫీలింగ్.. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. యాసిడ్ దాడులు.. కుల దురహంకార హత్యలు మరోవైపు.. ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సినిమాలోనూ ప్రేమకు.. ప్రేమికులకు అడ్డుపడే విలన్లు ఉన్నట్లు.. నిజ జీవితంలోనూ ఎన్నో అడ్డంకులు.. అవరోధాలు.. అంతరాలు.. కులాలు, మతాల కట్టుబాట్లు.. ప్రేమ జంటల పాలిట ఇనుప కంచెలై సమాజానికి అడ్డుపడుతున్నాయి. తరాలుగా.. యుగాలుగా.. కొందరి ప్రేమికుల పాలిట మరణ శాసనాలుగా నిలుస్తున్నాయి. ఇకనైనా కట్టుబాట్లను వీడి.. నిజమైన ప్రేమికులకు అడ్డుపడే అంతరాల కంచెల్ని తొలగించి.. ఎర్రని రోజాపూలతో స్వాగతం పలకాలని ఆశిస్తూ.. ప్రేమికులకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ రోజే అనుకూలమైనదిగా భావిస్తారు. ప్రేమికుల రోజుకి సంబంధించిన చరిత్ర ఏమిటి? అనే దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాలెంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయపదంగా మారింది. ఇంతకీ వాలెంటైన్ ఎవరు? మూడో శతాబ్దంలో రోమ్ నగరంలో హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మతగురువు సెయింట్ వాలెంటైన్. ఆ కాలంలో రోమన్ చక్రవర్తి అయిన రెండో క్లాడియస్ పాలనలో రోమ్ సామ్రాజ్యం ఉండేది. క్రూరాతిక్రూరమైన రాజు, ప్రేమ పెళ్లిళ్లు కాదు కదా అసలు పెళ్లిళ్లంటేనే ఇష్టం ఉండేదికాదు. అందుకే పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్నది ఆయన భావన. అయితే ఈ ఆదేశాలు వాలెంటైన్‌కు నచ్చలేదు. దీంతో, చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవాడు. విషయం తెలుసుకున్న చక్రవర్తి, వాలెంటైన్‌ని చెరసాలలో పెట్టి, మరణశిక్ష విధించారు. అయితే, జైల్లో జైలర్ కుమార్తెతో వాలెంటైన్ ప్రేమలో పడతాడు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయడానికి ముందు వాలెంటైన్ తన ప్రియురాలికి ప్రేమలేఖ పంపిస్తాడు. వాలెంటైన్ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్, గెలాసియస్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు.
వాలెంటైన్స్ డేని తొలిసారిగా 496 సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ తర్వాత వాలెంటైన్స్ డే భారత్‌లో ప్రాచుర్యం పొందించింది.
ఒక్కో దేశంలో ఒక్కోలా..!
'యూ ఆర్ మై వాలెంటైన్' అంటూ అబ్బాయిలకు, అబ్బాయిలైతే.. 'నువ్వే నా ప్రేమదేవత' అంటూ అమ్మాయిల కు తమ ప్రేమను వ్యక్తం చేసే రోజు. నిజానికి ఏడాదిలో ఏ రోజైనా తమ ప్రేమను వ్యక్తం చేయొచ్చు.. అది వేరే సంగతి. కానీ ప్రేమించుకుంటున్న వారి దష్టిలో ఈ ప్రేమికుల దినోత్సవానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ఆ రోజు వాళ్లది.. అంతే. అదే మరి ప్రేమ వైరస్ మహిమ! ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్యనైనా పుట్టవచ్చు. ఎవరికైనా కలగవచ్చు. రెండు హదయాలను ఒక్కటి చేయొచ్చు. అందుకే, ప్రపంచమంతా ప్రేమకు గులామై.. ప్రేమికులకు సలాం కొడుతోంది.
కొన్ని దేశాలు ఫిబ్రవరి 14న కాకుండా, ప్రేమ కోసం ప్రత్యేక దినాలు పాటిస్తుంటాయి. జపాన్‌లో ఫిబ్రవరి 14న అమ్మాయిలే అబ్బాయిలకు గిఫ్టులిస్తారు. మళ్లీ మార్చి 14న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చినవి గిఫ్టులుగా తిరిగివ్వాలి. దీన్ని 'వైట్ డే' అంటారు. చైనాలో ఈ ప్రేమికుల రోజును 7వ నెల 7వ తేదీన క్విజీ ఫెస్టివల్‌గా జరుపుకుంటారు. ఇంగ్లాండ్‌లో జాక్ వాలెంటైన్ వేషంలో చిన్నారులకు గిఫ్టులు పంచుతారు. దక్షిణాఫ్రికాలో నచ్చిన వ్యక్తుల పేర్లను భుజాలపై హార్ట్ షేపులో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. జర్మనీలో హార్ట్ షేప్ గడ్డిపూల స్టిక్కర్లతో గిఫ్టులు పంచు కుంటారు. బల్గేరియాలో ఫిబ్రవరి 14ను 'వైన్ డే'గా సెలబ్రేట్ చేసుకుంటారు. బ్రెజిల్‌లో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 కాదు, జూన్ 12ను సెయింట్ 'ఆంటోనీస్ డే'ను 'డయా డస్ నమోరడస్' పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. వేల్స్‌లో అయితే.. జనవరి 25న 'సెయింట్ డ్వైన్వెన్స్ డే'ను జరుపు కుంటారు. ఘనాలో.. 'నేషనల్ చాక్లెట్ డే'గా వేడుకలు జరుపు కొంటారు. ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. ఫిన్లాండ్, ఎస్టోనియాల్లో ఫిబ్రవరి 14ను స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటారు.
ప్రేమకు డేట్స్, డెడ్‌లైన్స్ ఉంటాయా ?
ఇక ప్రేమికుల రోజు కార్పొరేట్ కంపెనీలు సష్టించిన మాయ అన్న వాదన మరొకటి. ఎందుకంటే వాలెంటైన్స్ డే సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరమా? ప్రేమకు డేట్స్, డెడ్‌లైన్స్ ఉంటాయా? అనంతమైన ప్రేమను ఏడాదంతా వ్యక్తం చేసినా సమయం చాలదు కదా? అనేవాళ్లు ఉంటారు. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ రోజును కేటాయిస్తే తప్పేముంది అనేవాళ్లూ ఉన్నారు. సో.. వాలెంటైన్స్ డే చుట్టూ జరిగే చర్చ కూడా ప్రేమలా అనంతమైనది. శాశ్వతమైనది.
ఆ దేశాల్లో వాలంటైన్స్ డే.. నిషేధం !
అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్నా కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్థాన్, సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది. వాలంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తుంటాయి. ఇది భారతదేశ సంస్కతి కాదంటూ వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. విశ్వహిందూ పరిషత్, శివసేన, భజరంగ్‌దళ్, శ్రీరాం సేన లాంటి హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, గొడవలు మామూలే.
ప్రేమ వర్సెస్ పరువు..
పరువు - ప్రతిష్ట జీవిత గమనంలో అందరూ కోరుకునేది అదే. అందరూ పరువుతో బతకాల్సిందే, దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పరువుగా బతకడం అంటే? కులమతాలకు అతీతంగా మనిషి మనిషిలా బతకడం. తనకున్న దాంట్లో బరువుగా జీవితం సాఫీగా నడవాలని అందరూ ఆకాంక్షిస్తారు. మరి పరువు కోసం ఏమైనా చేస్తారా..! తరచుగా వినిపిస్తున్న పరువు పేరున జరిగే హత్యల పరమార్థం ఏంటి..?
ఇటీవలి తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన కులదురహంకార హత్యోదంతాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయి ప్రేమలో పడి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఆ తల్లిదండ్రుల దష్టిలో క్షమించరాని నేరంగా మారుతోంది. మనసును తొలిచిన ఆ ఆలోచన పెనుభూతంగా మారి కన్నవారిని కసాయివారిగా మార్చేస్తోంది. ఇదేదో క్షణికావేశంలో జరిగేది కాదు. ఏళ్ల తరబడి పదును పెట్టిన ఆవేశం, తమ అమ్మాయి వివాహమాడిన యువకుడిని దయాదాక్షిణ్యాలు లేకుండా హతమార్చే స్థాయికి దిగజారుస్తోంది. చివరకు కన్నబిడ్డల్నీ చంపుకుంటున్నారు.
మిర్యాలగూడలో ప్రణరుని హత్య తరహాలోనే హైదరాబాద్ చందానగర్‌లోనూ ఘటన జరిగింది. తాజాగా ఏపీలో కర్నూలులో ఓ యువకుడు కులదురహంకారానికి బలైన ఘటన చర్చనీయాంశమైంది. సమాజంలో ఎక్కువ మంది విద్యాధికులు ఉన్నప్పటికీ దేశంలో కులాంతర వివాహాల సంఖ్య 5 శాతమే ఉంటోందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కులాంతర వివాహాల పట్ల సహనం ఉండాలి. కులంతో సంబంధం లేకుండా వివాహాలను ఆమోదించే సహృదయం వస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. దీంతోపాటు మత మార్పిడితో వివాహం చెల్లందంటూ ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చాయి. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మతం మార్చుకోవడం.. మార్చుకోకపోవడం అనేది వారిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగిన ఉదంతం కాదు. కాకపోతే కులాంతర మతాంతర వివాహాలు ఇప్పటి తరానికి సహజమైపోయాయి. విద్య, విజ్ఞానంతో యువత కులాల మధ్య అంతరాన్ని చెరి పేస్తోంది.
- ఉదయ్ తేజశ్విని ఆకుల
లివ్-ఇన్ రిలేషన్..
అదో కుటుంబం.. పెళ్లి పేరెత్తని అనుబంధం.. దానిపేరే సహజీవనం.. మారుతున్న సమాజంలో, పెరుగుతున్న నాగరిక జీవనంలో, చైతన్యం ఎక్కువైన నేటి రోజుల్లో ఈ సంబంధాలు సర్వ సాధారణంగా మారాయి. పెళ్లికాకుండానే కలిసి జీవించే జంటలు మెట్రో నగరాల్లో తారసపడుతున్నాయి. కలిసి పనిచేస్తున్న కొలీగ్స్, అభిరుచులు కలిసిన యూత్, ఒంటరి జీవనంతో బోర్ ఫీలయ్యే సింగిల్ పర్సన్స్.. ఇలా తమ భావాలకు సరిజోడును వెతుక్కొని మరీ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు సై అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లికి ప్రత్యామ్నా యమే సహజీవనం. అయితే పెళ్లి అనే తంతులో సంప్రదా యాలు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు, కట్టుబాట్లు ఇమిడి ఉంటాయి. అదే.. సహజీవనంలో అలాంటివేమీ ఉండవు. ఇద్దరి ఇష్టాలకు అనుగుణంగా.. పరస్పర అంగీకారంతో సాగించే జీవనం. ఈ తరహా ఒప్పంద జీవనంలో ఇద్దరికీ స్వతంత్య్రం ఉంటుంది. సహజీవనం భారతీయ సమాజానికి కొత్త అయినా ఈ వ్యవస్థ కొన్ని శతాబ్దాల క్రితమే ఆచరణలో ఉండేదని తెలుస్తోంది. మానవ శాస్త్రం, సామాజిక శాస్త్రాల దక్కోణంలో చూసినపుడు సహజీవనం మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందుతున్న పెళ్ళి, కుటుంబ వ్యవస్థలతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ముడిపడి ఉన్నట్లు తెలుస్తున్నది. మానవుడు ఆదిమ మానవుని నుండి నాగరిక మానవునిగా, అటుపైన ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందినప్పటికీ స్త్రీ పురుషుల సంబంధాల మధ్య గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పురుషుడు సంతానం కోసం స్త్రీతో జత కట్టడానికి ఆసక్తి చూపుతాడు. క్రమేణా ఆ బంధం బలపడి ఇరువురూ వివాహ బంధంలో అడుగుపెడతారు. అయితే సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లితో కట్టుబాట్లు, వరకట్న వేధింపుల కేసులు, భరణాలు వంటివి ఎదురవుతాయని కొందరు సహజీవనంవైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు సామాజిక వేత్తలు. పరిణితి చెందిన స్త్రీ-పురుషుల అనుబంధంలో ఒకరినొకరు ప్రేమించబడి, గౌరవించబడతారు. అది అత్యున్నత సమాజంలోనే సుసాధ్యం.