ప్రజాశక్తి - సీతంపేట : వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే సచివాలయాల పరిధిలో హెల్త్ వెల్నెస్ సెంటర్లు మంజూరు చేసింది. ఈ కేంద్రాల పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని, అందుకు అనుగుణంగా అక్కడే మందులు, ల్యాబ్‌కు సంబంధించిన పరికరాలు ఉంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపులు కూడా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను మంజూరు చేసింది. ఆశయం గొప్పదే అయినా ఆచరణలో మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందాన పనులు జరుగుతున్నాయి. వెల్నెస్ సెంటర్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్టర్ల అలసత్వమో గానీ పనులు మాత్రం నత్తనడన జరగడంతో పలుచోట్ల చెట్ల కిందే వైద్యసేవలందించాల్సిన దుస్థితి నెలకొంది.
సీతంపేట డివిజన్లో సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం తదితర మండలాల్లోని 62 హెల్త్ వెల్నెస్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క భవనానికి రూ.18 లక్షలు కేటాయించారు. ఇప్పటికీ కేవలం 13 కేంద్రాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో తొమ్మిది పూర్తి కావడానికి సిద్ధం చేస్తున్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా పంచాయతీరాజ్‌శ ాఖ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో హెల్త్ వెల్నెస్ సెంటర్లు పనులు నిర్వహిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. మూడేళ్లయినా కనీసం సగం కూడా పనులు పూర్తిగా కాకపోవడంతో ఎందుకింత జాప్యం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సచివాలయం పరిధిలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్‌కు (ఎంఎల్‌హెచ్‌పి) మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడ్ హెల్త్ సిబ్బంది వీరి పరిధిలో ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఉంటారు. వెల్నెసె సెంటర్ ద్వారా 64 రకాల మందులు, 14 రకాల పరీక్షలకు సంబంధించి సామగ్రిని సెంటర్లో భద్రపరుస్తారు. ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపు వెల్నెస్ సెంటర్లో నిర్వహించాలి. దాదాపు సెంటర్ పరిధిలో కనీసం రెండు పంచాయతీలకు సంబంధించిన రోగులకు వైద్యం అందిస్తారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు పనులు పూర్తిగా కాకపోవడంతో ఫ్యామిలీ ఫిజీషియన్ వాహనం ఆరుబయట చెట్లు కింద క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ వాహనం నెలకు 26 రోజులు వెల్నెస్‌సెంటర్ వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపు నిర్వహిస్తారు. వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా వెల్నెస్ సెంటర్లు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో మందులు, ల్యాబ్ పరికరాలు పరాయి పంచన నిల్వ ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెల్త్ వెల్నెస్ సెంటర్ల పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రజలు, వైద్యులు కోరుతున్నారు.
పనులు పూర్తికి చర్యలు
హెల్త్ వెల్‌న్నెస్ సెంటర్ల పనులు సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికి 22 పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నేను ఇఇగా బాధ్యతలు స్వీకరించి 15 రోజులు కావస్తుంది
ఎస్ సింహాచలం
ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ, సీతంపేట










