ప్రజాశక్తి - పల్నాడు జిల్లా :నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మెట్ట పంటలు సాగు చేసి దాదాపు రెండు నెల్లు కావస్తోందని, ప్రాథమిక దశలో ఉన్న పైర్లు నీటి కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రూ.వేలు ఖర్చు చేసి వేసిన పైర్లు కళ్లెదుటే ఎండిపోయే దశకు చేరుతుంటే మనోవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 15 నాటికి సాగునీరు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆగస్టు నెల సగం రోజులు గడుస్తున్నా నీటి విడుదల ఊసే లేదని విమర్శించారు. మిర్చి మొక్కలు నాటుతున్న రైతులు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటున్నారని, ఇందుకుగాను అదనంగా రూ.వేలు ఖర్చవుతోందని తెలిపారు. గతంలో సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ లెవెల్‌లో నీరున్నా పంటలను కాపాడే నిమిత్తం విడుదల చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి నీటిని విడుదల చేయకుంటే రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అన్నారు.










