ఎప్పుడో కలిసిన ఆనందభాష్పాలను
ఆణిముత్యాల్లా దిగులు పొరల మాటున
భద్రంగా దాచుకుంటోంది ఆడ మనసు
అప్పుడప్పుడు తడిమి చూసుకుంటూ
ఆనంద పడుతోంది బతుకు ఎడారిలో
వీచే పెనుగాలులకు తడి ఆరిపోలేదని
ప్రతిరోజు కంటి కొనల్లో గుచ్చుకునే
ఆకలి సూపుల బాణాల దెబ్బలకు కారే
కన్నీటి వరద నీరదని అర్థం కాలేదు
ప్రతినిత్యం ఎదలోతుల్లోకి దిగబడే
వంకర మాటల తూటాల గాయాల
నెత్తుటి మరకలవని గుర్తుకు రాలేదు
అనుదినం ఒంటి మీదకు వచ్చి పడే
వెకిలి నవ్వుల నిప్పురవ్వలు రేపే
అగ్నిపర్వతపు వెచ్చని లావా
అని అనుకోలేదు
అనుక్షణం నిలువెల్లా కాల్చుకుని
ఛీత్కారాలు ఛీదరింపుల
చితి మంటల చుట్టూ
అల్లుకున్న ఆవిర్లవని అవగతం కాలేదు
జీవితంలో ఎదురయ్యే ఆనందాలన్నీ
నీటి జాడలు లేని
ఎండమావులని తెలియక
జ్ఞాపకాలు సముద్రంలోకి జారిపోయే
దుఃఖపు నదుల తీరాన నిలబడి
ఆత్రంగా ఏరుకుంటోంది గతకాలపు
తీపిగుర్తులు చిల్లిగవ్వలను పిచ్చితల్లి
ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985