Oct 09,2023 23:17

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ (డిఎస్‌సి) నాలుగున్నరేళ్లుగా నిలిచి పోయింది. ప్రతి ఏటా డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని వైసిపి తన మేనిఫెస్టోలో పేర్కొంది. సిఎం జగన్‌ పాదయాత్రలో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో ఉంచినా గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా డిఎస్‌సి పోస్టుల భర్తీకి నోటిఫకేషన్‌ విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1200 వరకు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 40 వేల మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
పాఠశాలల విలీనం తర్వాత ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రాథమిక పాఠశాలలో బిఇడి చేసిన ఎస్‌జిటి ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు సర్ధుబాటు చేయడం వల్ల ప్రాథమిక పాఠశాలల్లో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో చాలా ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. కొంతమందిని పల్నాడు జిల్లాలోని పాఠశాలలకు పంపినా వారిలో కొంత రాజకీయ నాయకుల సిఫార్సులతో మళ్లీ గుంటూరు పరిసరాల్లో పనిచేయడానికి ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు.
తాడేపల్లి కేంద్రంగా అక్రమ బదిలీలకు జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులకు సిఫార్సులేఖలు ఇప్పిస్తామని భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలూ వున్నాయి. ప్రమోషన్ల నిలిచిపోవడం వల్ల కూడా సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. ఎయిడెడ్‌ పాఠశాలలు అన్‌ఎయిడెడ్‌గా మారిన నేపథ్యంలో 240 మంది ప్రభుత్వంలో వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో సర్ధుబాటు చేసినా ఇంకా కొరత వెంటాడుతోంది. జిల్లాలో 1200 మంది ఉపాధ్యాయులను డిఎస్‌సి ద్వారా నియమించాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతుండగా ప్రభుత్వం 507 మందే అవసరమని అంటోంది. జిల్లా వ్యాప్తంగా బిఇడి, డిఇడి, పండిట్స్‌ శిక్షణ పూర్తిచేసుకున్న దాదాపు 40వేల మంది ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదనపు బాధ్యతలతో అవస్థ పడుతున్నారు.
25 వేల పోస్టులకు డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇవ్వాలి
ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

రాష్ట్రంలో ప్రస్తుతం 20-25 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 8,366 ఖాళీలను చూపడం సరికాదు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌సి కోసం ఎదురు చూస్తున్నారు. పల్నాడులో సిఫార్సులతో సర్కారు బదిలీలకు అనుమతించడం వల్ల ఉపాధ్యాయుల కొరతతో పేద విద్యార్థులు నష్టపోతున్నారు.
విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం
యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌

నూతన విద్యా విధానం అమలుకు చూపిస్తున్న ఉత్సాహం పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చూపడం లేదు. మేనిఫెస్టోలో 98.5 శాతం అమలు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి డిఎస్‌సి ద్వారా నియామకాలు ఎందుకు చేపట్టలేదు. ఉపాధ్యాయులకు పనిభారం పెరిగింది. నాడు-నేడు పాఠశాలలను రంగులతో తిర్చిదిద్దినా చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఉండాలి కదా?