ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు ప్రభుత్వం అందించాల్సిన కనీస సౌకర్యాలు లభించడంలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాలో ఉపాధి కార్మికులు పొలాల వద్ద మట్టి పనులు చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రతతో రెండు జిల్లాలకు చెందిన ఉపాధి కార్మికులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే వేసవి తీవ్రత పెరుగుతోంది. వడగాల్పులు పెరిగాయి. ఉక్కపోతతో పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో కనీస జాగ్రత్తలు కరువయ్యాయి. పలుగు,పారల వినియోగంలో దెబ్బలు తగలడం, పాములు, ఇతర విషజీవాల కాటుకు గురవ్వడం వంటి ఘటనల నుంచి తక్షణం ఉపశమనం పొందేందుకు ఫస్టు ఎయిడ్ బాక్సులు అందుబాటులో ఉండడం లేదు. మేడికొండూరు మండలం తురకపాలెంలో బుధవారం పనులు చేస్తుండగా పెద్ద పాము (కొండచిలువ) రాగా కూలీలు భయభ్రాంతులకు గురయ్యారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయడంలేదు. ఎండ వేడిమిని ఉపశమనం పొందేందుకు స్వల్ప విశ్రాంతి కోసం గతంలో టెంట్లు వేసే వారు. ఇప్పుడు కనీసం టెంట్లు వేయడం లేదు. ఉదయం 11 గంటలకన్నా పనులు ముగించి కార్మికులను నీడ ప్రదేశానికి తీసుకువెళ్లాలి. కానీ చాలా చోట్ల 11 గంటల తరువాత కూడా పనులు చేయిస్తున్నారు. పనులు పూర్తి చేసిన తరువాత ఫొటోలను అప్‌లోడ్ చేయాలని మధ్యాహ్నం 12 గంటలవరకు అక్కడే ఉండమని డ్వామా సిబ్బంది వత్తిడి చేస్తున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాలోని గత వారం రోజులుగా పలు మండలాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 87,35,991 పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో 30,85,104 పనిదినాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఎక్కువగా మట్టిపనులు చేయిస్తున్నారు. రహదారుల నిర్మాణం, కందకాలు తవ్వడం, కాల్వలను తవ్వడం, ఉన్న కాలువలను బాగుచేయడం, సాగునీటి పారుదలకు కాల్వగట్లను పట్టిష్టపర్చడం తదితరులు పల్నాడు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల పనిదినాలు సంఖ్యబాగా తగ్గించారు. అలాగే ఉపాధి హామీ చట్టం ప్రారంభం అయినప్పటి నుంచి ఎండా కాలంలో 20 నుంచి 30 శాతం సొమ్ము అలవెన్సు ఇచ్చే వారు. ఇటీవల ఈ అలెవెన్సును రద్దు చేశారు. దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బలు ఎక్కెలా పనిచేసినా కనీస కూలి రావడం లేదు. రోజుకు రూ.272 కనీస వేతనం ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.230 నుంచి రూ.250 మాత్రమే అందుతున్నాయని తెలిపారు. పనిచేసే చోట భద్రత, మంచినీళ్లు, టెంట్ రానుపోను ఛార్జీలు, గునపం, పార, తట్ట ఇవ్వాల్సి ఉండగా వాటిని మీరే తెచ్చుకోండని అధికారులు చెబుతున్నారని కూలీలంటున్నారు. వీటికి సంబంధించి సొమ్ము మీఖాతాల్లో జమచేస్తామని మీరే అన్ని తెచ్చుకోవాలని చెబుతున్నా అందుకు తగిన సొమ్ము రావడంలేదని కార్మికులు తెలిపారు.
సమ్మర్ అలవెన్సుఇవ్వండి : ఈమని అప్పారావు
ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్సును పునరుద్ధరించాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వేతనంలో 40 శాతం సమ్మర్ అలవెన్సు అదనంగా ఇవ్వాలన్నారు. 100 రోజులు పూర్తి చేసిన కుటుంబానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచూపాలన్నారు. పనిచేసే చోట టెంట్, తాగునీరు, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని కోరారు. నీళ్లకు రూ.10, గునపం, తట్టకురూ.20, సానకు రూ.50 ఇవ్వాలన్నారు. అన్‌లైన్ మస్టర్ విధానం రద్దు చేసి పాతపద్ధతిని అమలు చేయాలని, పేస్లిప్‌లను ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో మేట్లకు స్మార్టు ఫోన్, రోజుకు రూ.5 పారితోషికం ఇవ్వాలన్నారు. తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతంలో కూడా ఉపాధి పనులు కల్పించాలన్నారు.










