May 29,2023 23:10

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరు, పల్నాడు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. దీంతో వర్షాలు రాక ఆలస్యమైతే ఖరీఫ్‌ జూన్‌ 10వ తేదీ వరకు ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువేనని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగింది. వడగాల్పులు పెరిగాయి. రోహిణీ కార్తె ప్రవేశంతో 25వ తేదీ నుంచి గత ఐదు రోజులుగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రానున్న నాలుగు రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గరిష్టంగా 47 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వడగాలులు కొనసాగుతున్నాయి. వేసవి తాపం, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు పెరిగాయి. వడగాల్పుల ప్రభావం వల్ల ఉదయం 10 గంటల నుంచి ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా రహదారులన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. కొంతమంది మాస్కులు, టోపీలు, గొడుగులు, ముసుగులు ధరించి బయటకు వస్తున్నారు. జనసంచారం తగ్గడంతో ఆటోలు, సిటీ సర్వీసులుఖాళీగా తిరుగుతున్నాయి.
వేసవి తీవ్రత కొనసాగుతుండటంతో రైతులు జూన్‌ 10వ తేదీ తరువాత వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. కనీసం 10 రోజులు పాటు వర్షాలు నిరాటకంగా కొనసాగితేనే ఖరీఫ్‌ సేద్యానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోకి జూన్‌ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పొలాల్లో వ్యర్ధపదార్ధాలు తొలగించి ఖరీఫ్‌కు సిద్ధం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షాలు పడితే దుక్కులు పోసేందుకు సిద్ధంగా ఉన్నారు. పల్నాడు ప్రాంతంలోని కొన్ని మండలాల్లో బోర్లు ద్వారా ముందస్తు ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధం అవుతున్నారు. పత్తి, వరి పంటలను బోర్లు ద్వారా సాగుచేయనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకు ముందే రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే విత్తన దుకాణాల వద్దకు రైతులు వెళ్తున్నారు. ఆగస్టు నుంచి సాగు చేయాల్సిన మిర్చి విత్తనాలను ఇప్పటికే కొంత మంది రైతులు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మిర్చి కంపెనీల బ్లాక్‌ మార్కెట్‌పై దృష్టిసారించాలని ప్రజా ప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అధికారులను కోరారు. పత్తి, వరి, మిర్చి విత్తనాల కొనుగోలుపై ఎక్కువ మంది రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌బికేల ద్వారా అన్ని రకాల విత్తనాలను సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. తొలకరి పంటలుగా గ్రీన్‌ మెన్యూర్‌ విత్తనాలు (పచ్చిరొట్ట) విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు ఇప్పటికే ఆర్‌బికేల్లో అందుబాటులో ఉంచామని, రైతులు 50 శాతం సబ్సిడీతో తీసుకోవచ్చునని తెలిపారు.