
ప్రజాశక్తి - చింతలపూడి
ఎండిపోయిన వరి పొలాలకి రూ.50 వేల నష్టం పరిహరం అందించాలని మాజీ ఎంఎల్‌ఎ ఘంటా మురళీ తెలిపారు. మండలంలో సమ్మేటివారిగూడెంలో పాతచింతలపూడి, శివపురం రైతులతో టిడిపి శివపురం ఎంపిటిసి చీకటి రాజేంద్రకపూర్‌తో కలిసి ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లోన్లు రద్దు చేసి, రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు ఇవ్వాలని తెలిపారు. బేతుపల్లి చెరువు, ఆంధ్రా కాలువకు పడిన గండ్లు పూడ్చితే రైతులకు ఎంతో ఉపయోగమని, వరి పంటలు ఎండిపోకుండా నీరు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత చింతలపూడి, సమ్మేటవారి గూడెం, శివపురం, గణిచర్ల రైతులు పాల్గొన్నారు.