
ఎండిపోయిన పంటలపై నివేదిక
- జిల్లా వ్యవసాయ అధికారి టి.మోహన్ రావు
ప్రజాశక్తి - బనగానపల్లె
రాష్ట్ర ప్రభుత్వం బనగానపల్లెను కరువు మండలంగా ప్రకటించిందని, ఎండిన పంటలపై నివేదికలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ మోహన్ రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని పాతపాడు, పసుపుల , చిన్న రాజుపాలెం గ్రామాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో పత్తి, మొక్కజొన్న, కంది పంటలను, పాతపాడు, చినరాజుపాలెం గ్రామాల్లో కంది, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులు ఎండిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారికి చూపించారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని, తమను ఆదుకోవాలని రైతులు కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుత పంటల పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వీలైనంతవరకు పంటలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, ఏఈఓ ఓబులేసు, పసుపల, పాతపాడు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు కల్పన, స్వామినాథన్, పాతపాడు ఎంపీఈఓ శైలజ, రైతులు పాల్గొన్నారు.