Nov 03,2022 00:08

ఎండిపోతున్న వరి పొలం

ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో అత్యధికంగా తాండవ కాలువ కింద సాగు చేస్తున్న వరి రైతులకు గడిచిన పక్షం రోజులుగా తాండవ నీరు సక్రమంగా అందక పోవడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీరు సక్రమంగా మండలానికి చేరుకోక పోవడంతో దాదాపుగా రెండు వేల హెక్టార్ల పంటపొలం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పాములవాక, నీలి గుంట, రామచంద్రపురం, బోడపాలెం, లింగాపురం, తంగేడు, బికేపల్లి, రామన్నపాలెం, తదితర గ్రామాలు తాండవ కాలువ కింద ఖరీఫ్‌ సీజన్లో వరి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో నీరు కోసం ఎదురు చూస్తున్నారు. మండల స్థాయి అధికారులు, తాండవ కాలువ ఇంజనీర్లు పట్టించుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండవ కాలువలో నీరు సమృద్ధిగా ఉన్నా అందకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమని, దీంతో, పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.