Sep 01,2023 01:14

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వర్షాల్లేక, పొలాలకు నీరందక పత్తి, మొక్కజొన్న, కంది పైర్లు ఎండిపోతున్నాయని, రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు, కౌలురైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, ఎలమంద, గురవాయిపాలెం తదితర గ్రామాల్లో పొలాలను నాయకులు గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగారు. అనంతరం నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో విలేకర్లకు వివరాలు చెప్పారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ నరసరావుపేట మండల పరిధిలో 18 వేల ఎకరాలకు పైగా సాగుభూమి ఉంటే 1600 ఎకరాలే సాగైందని, ఇందులో 1000 ఎకరాలకు పైగా పత్తి, 400 ఎకరాలకు పైగా మొక్కజొన్న, 200 ఎకరాల వరకు కంది ఉందని చెప్పారు. వర్షాభావం నేపథ్యంలో పైర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ఎకరాకు రూ.20 వేల వరకూ పెట్టుబడులయ్యాయని, ఆ పెట్టుబడి వెనక్కు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు కొత్తగా సాగుకు సిద్ధమైన రైతులు ఇప్పటికే పలుమార్లు దుక్కులు దున్నారని, ఇందుకుగాను ఎకరాకు రూ.6-8 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. గతంలో నాగార్జునసాగర్‌ జలాశయంలో డెడ్‌ స్టోరేజ్‌లో నీరున్నా ఆరుతడి పంటలకు సరఫరా చేశారని, ఇప్పుడు జిల్లా నుండి జలవనరుల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా నీరు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 20 శాతమే సాగైందని, ఈ క్రమంలో కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతులతోపాటు కూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన కార్మికులకు పనులు లేకుండా పోయాయని, వారికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెబుతున్నా విత్తనాలు, ఎరువులపై రైతులకు అవగాహన కల్పించడం లేదని, ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారవు మాట్లాడుతూ సాగుదారుల్లో 70 శాతం మంది కౌల్దార్లేనని, ఎకరాకు రూ.15-20 వేల వరకు కౌలు చెల్లించి ఇప్పుడేమీ పాలుపోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల వయస్సున పత్తి మొక్కలు గిడసబారిందని, మొక్కజొన్నదీ అదే పరిస్థితని చెప్పారు. అధికారులు సత్వరమే స్పందించి పంటనష్టం అంచనాలు వేసి పరిహారం అందించాలన్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు. పరిశీలనలో రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, నాయకులు కె.ఆంజనేయులు, రైతులు కె.వెంకటేశ్వర్లు, వీర్ల వెంకటేశ్వర్లు, పి.అంకమ్మరావు, షేక్‌ సుభాని పాల్గొన్నారు.