ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్ : మండలంలోని బాలగుడబ, నర్సిపురంలో వర్షాల్లేక నీటి ఎద్దడికి గురై ఎండిపోతున్న వరి పంటను ఇన్‌ఛార్జి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆర్.శ్రీనివాస్, రైతు శిక్షణ కేంద్రం ఎడి శారద, ఎఒ అశోక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి పంట నష్టం ప్రాథమిక అంచనా వేస్తున్నామన్నారు. ఎఒ మాట్లాడుతూ వర్షం పడక, తేమ లేని వరి పంటలకు ఎకరాకు 2 కేజీలు 19:19:19 లేదా 13:0:45 లేదా మల్టీకె వంటి రసాయనాలు పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని 14 నుండి 16 ట్యాంకులు పిచికారీ చేయాలన్నారు. అలా చేయడం వల్ల వారం నుంచి పది రోజుల వరకు తేమ ఉండి మొక్కలు వాడిపోకుండా నివారించ వచ్చునని తెలిపారు. పూర్తిగా వాడిన వరి పంట నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.










