
ప్రజాశక్తి - ఆచంట
ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామని, ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడం తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్ విమర్శించారు. మండలంలోని ఆచంట వేమవరం, శేషమ్మచెరువు తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో శివారు రైతు సంఘం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరందక వరిచేలు నెర్రలు తీస్తున్నాయని, వేసిన ఎరువులు అలాగే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఇరిగేషన్ అధికారితో సాగునీటి సమస్యపై మాట్లాడారు. ఎండిపోతున్న పంట పొలాలకు సమృద్ధిగా సాగునీరందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దేవ కాలువ చెత్తాచెదారంతో పూడుకుపోయిందని, దీంతో సాగునీరు శివారు గ్రామాలకు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. అనంతరం రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌తో మాట్లాడి ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, ఇ-పంట, ఇకెవైసి తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని, తేమ శాతం రైతు భరోసా కేంద్రం వద్ద చూపిన విధంగా రైస్‌మిల్లు వద్ద కూడా అదే తేమ శాతానికి అన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరమల్లు వీర్రాజు, బుర్ర నాగేశ్వరరావు, బాపనయ్య, తాళ్లూరు రాము, పలాస నరసింహమూర్తి పాల్గొన్నారు.