Oct 19,2023 20:25

సీతానగరం: ఎండిన వరి పంటను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు

ప్రజాశక్తి- సీతానగరం : మండలంలోని కోట సీతారాంపురంలో వర్షాభావం వల్ల ఎండిపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఆర్‌.శ్రీనివాస్‌, రైతు శిక్షణ కేంద్రం ఎడిఎ శారద, శాస్త్రవేత్త సౌజన్య, ఎఒ అవినాష్‌ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్‌ నెలలో వర్షపాతం ఆశజానకంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటి వరకూ 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 36 మిల్లీమీటర్ల మాత్రమే నమోదైందన్నారు. దీంతో వర్షధారంగా పండిన వరి పంటలు కొన్ని మండలాల్లో నీటి ఏద్దడికు గురువుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు కలిసి పంటలను పరిశీలించి రైతులకు నీటి ఎద్దడి నుంచి బయటపడే పరిస్కారం చూపించాలన్నారు. సీతానగరంలో 6 గ్రామాలలో వరి పంట ఎండిపోయిందన్నారు. ఇటువంటి పంటలను జిల్లా వ్యాప్తంగా గుర్తించి జిల్లా కలెక్టర్‌కు నివేదికిస్తామన్నారు. శాస్త్రవేత్త సౌజన్య మాట్లాడుతూ ఇలా వర్షం పడక, తేమ లేని వరి పంటలలో ఎకరాకు 2కేజీలు వరకు 19:19:19, 13:0:45, మల్టీకె వంటి రసాయనాలు పిచికారీ చేసుకోవాలని లీటర్‌ నీటికి 10 గ్రాముల కలుపుకొని 14 నుండి 16 ట్యాంక్‌లు పిచికారీ చేయాలన్నారు. అలా చేయడం వల్ల పది రోజులు వరకు తేమ ఉండి మొక్కలు వాడిపోకుండా కాపాడుకోవచ్చు నన్నారు. వ్యవసాయాధికారి అవినాష్‌ మాట్లాడుతూ పూర్తిగా వాడి పోయిన వరి పంట నివేదికపై అధికారులకు పంపిస్తామని ఇప్పటి వరకు నిడగళ్ళు కోట, సీతారాంపురం, వెన్నెల బ్చుంపేట, సూరంపేట, పెదభోగిలా, గాదెలవలసలో ఎద పంటలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
వర్షా భావాన్ని తట్టుకునేలా చర్యలు చేపట్టాలి
పాచిపెంట: మండలంలో గత 20 రోజులుగా వర్షాల్లేకపోవడం వల్ల మెట్టు పంటలు వర్షాభావ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని, కావున రైతులు తగు చర్యలు చేపట్టడం ద్వారా పంటలను రక్షించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. మండలంలోని పి.కోనవలస రైతు భరోసా కేంద్రం పరిధిలో గల పంటలను పరిశీలిస్తూ రైతులకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాభావానికి గురయ్యే వరి పంటపై రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోవడం ద్వారా పది రోజుల పాటు పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే ఎండ వేడిమికి దోమపోటు, పాము పొడ తెగులు ఉధృతి ఎక్కువగా ఉందని, ఆర్‌ జి ఎల్‌ 2537, సాంబమసూరి రకాలు వీటిని తట్టుకోలేవని, వీటి నివారణ చర్యలుగా ఇమెడా క్లోప్రేడ్‌, ధయో మెధగ్జామ్‌, చెస్‌, అప్లాడ్‌ వంటి మందుల్లో ఒకదాన్ని సాఫ్‌ లేదా హెక్సా కొనజోల్‌ లేదా ప్రాఫీ కొనజోల్‌ మందులతో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అలాగే పత్తి పంటపై మల్టీకే ఐదు గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వర్షా భావానికి రసం పీల్చు పురుగులు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని. వీటి నివారణకు ఎసిటమిప్ప్రిడ్‌ లేదా తయో మెతాక్జోమ్‌ లలో ఒకదాన్ని 0.4 గ్రాములు లీటర్‌ నీటి కలిపి పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విఎఎ నాగమణి, రైతులు పాల్గొన్నారు.
ఎండిన పైరుకు ద్రవ జీవామృతంతో ఉపశమనం
పార్వతీపురం రూరల్‌: మెట్టు ప్రాంతాలలో వర్షాధార భూములలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తట్టుకునేందుకు ద్రవ జీవామృతంతో కొంతవరకు రక్షణ కల్పించవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ షణ్ముఖ రాజు అన్నారు. గురువారం ఈ విషయంపై రైతులతో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్టు ప్రాంతాల్లో నీరు లేని పంటలో జీవం కల్పించడానికి ఒక ట్యాంకు నీటిలో రెండు లీటర్ల ద్రవ జీవామృతం కలిపి, పిచికారీ చేయాలని, దీంతో పాటుగా సప్త ధాన్యంకుర కషాయం ఒక ట్యాంకకు లీటర్‌ చొప్పున, పేడా మూత్ర ఇంగువ ద్రావణం ఒక ట్యాంకుకు లీటర్‌ చొప్పున పంట పెరుగుదలకు పై ద్రావణాల్లో ఏదైనా ఒకటి పిచికారి చేసుకోవాలన్నారు. రైతులు సిబ్బంది పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన కెవికె సిబ్బంది
కురుపాం: మండలంలోని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గురువారం పలు గిరిజన గ్రామాల్లో సాగు చేస్తున్న వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కెవికె సమన్వయకర్త టిఎస్‌ఎస్‌కె పాత్రో, సహాయ వ్యవసాయ సహాయకులు నిర్మల జ్యోతి వరి సాగు చేసే రైతులతో మాట్లాడుతూ వరి కోత దశలో ఉన్నందున యూరియా 2 శాతం పిచాకారి చేయాలని, పత్తి పిందె, కాయ దశలో ఉన్నందున యూరియా 1 శాతం పిచికారీ చేయాలని తెలిపారు. వీటోతో పాటు సూక్ష్మ పోషకాలు ద్రావణం పిచికారీ చేయాలని, అలా అయితే పంటలు దిగుబడులు తగ్గకుండా ఉంటాయని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో కెవికె సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

చి'వరి' పోరాటం
ప్రజాశక్తి - వీరఘట్టం
మండలంలోని చిట్టపూడి వలస గ్రామ సమీపంలో వరి పంటను కాపాడుకునేందుకు చివరిసారిగా అన్నదాత ఆరాటం పడుతున్నాడు. పంట పొట్ట దశలో ఉన్నందున సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వేరే రైతు సహాయంతో మోటర్‌ సదుపాయం ద్వారా పంటను కాపాడుకునేందుకు నీటిని మళ్లిస్తున్నారు. తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ఉందని చెప్పుకోవటమే తప్ప పిల్ల కాలువ ద్వారా సాగునీరు రాకపోవడంతో పంటను సాగు చేసిన మొదలు కోతకు వచ్చేంతవరకు నీటి కోసం ఆరాట పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.