Aug 10,2023 21:59

ప్రజాశక్తి - దెందులూరు
          కృష్ణా డెల్టా శివారు సీతంపేట ఛానల్‌ ఆయకట్టుకు సాగునీరందించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరులో సాగునీరందక బీటలు వారిన వరి పొలాల్లో ఎండిన వరి దుబ్బులతో రైతులు, కౌలు రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. సాగునీరందించాలని ధర్నా నిర్వహించారు. సాగునీరందించి పంటలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహా, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్న సీతంపేట ఛానల్‌ కాలువ కింద వేలాది ఎకరాలకు సాగునీరందక రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టారని, వేసిన పంటలకు సాగునీరందక ఎండిపోయే దశకు చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలతో ఉన్నారని చెప్పారు. సాగునీరందించేందుకు ప్రభుత్వం, అధికారులు తగిన ప్రణాళికతో వ్యవహరించకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని విమర్శించారు.
పట్టిసీమ కాలువ ద్వారా సాగునీరందించే అవకాశం ఉన్నా ముందుగా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని సాగునీరందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సీతంపేట ఛానల్‌ కాలువ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. సాగునీరందించకపోతే రైతులను సమీకరించి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, సీతంపేట ఛానల్‌ ఆయకట్టు రైతులు మాగంటి రాజు, మీసాల ఈశ్వరరావు, మాగంటి నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, కొండపావులూరి బలరామకృష్ణయ్య, గొరిపర్తి రామలింగేశ్వరరావు, ముళ్లపూడి అమ్మిరాజు, బేవర అను పాల్గొన్నారు.