
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నీటి పారుదల శాఖ మంత్రి మాటలు నమ్మి ఆరుతడి పంటలు సాగు చేసిన నాగార్జున సాగర్ కుడి కాల్వ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ఎందుకు ప్రకటించలేదని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ ప్రశ్నించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని సాగు భూముల్లో 90 శాతం కుడి కాల్వ ఆయకట్టేనని, అయితే ఈ జిల్లానే సిఎం, మంత్రికి కనిపించినట్లు లేదని అన్నారు. రైతులకు ప్రభుత్వం ఏదో విధంగా నష్టపరిహారం చెల్లించి బాధ్యత వ్యవహరించాలని కోరారు. వ్యవసాయం రంగంపై, రైతుల ఇబ్బందులపై అవగాహన లేని వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉండగా అదేమీ జరగలేదన్నారు. ఎన్నికల కోసం నిత్యం ప్రచార పర్యటనలు చేస్తున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎండిపోతున్న పైర్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరష్ట్రంలో 39 శాతమే సాగైందని, అయితే నరసరావుపేట మండలంలో 30 శాతమే సాగైందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లాలోని 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, దీనిపై జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులను సిపిఎం ఆధ్వర్యంలో కలిసి వివరిస్తామని చెప్పారు. మిర్చి పైరును కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితిలో రైతులున్నారని అన్నారు. జిల్లాలో 10 శాతం భూమి బోర్లు బావులు కింద సాగవుతుండగా ఇందులో 5 శాతమై ఇప్పుడు సాగైందని, వారు కూడా నీటికి నానా అవస్థ పడుతున్నారని చెప్పారు. ఏయే పంటలు సాగయ్యాయో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని, నష్టపరిహారాన్ని అంచనా వేయాలని కోరారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించి చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి. తదితరులు పాల్గొన్నారు.