
ప్రజాశక్తి - సాలూరు : మండలంలోని కొత్తవలస, పిఎన్ బొడ్డవలస, కూర్మరాజుపేట, చంద్రప్పవలస, దేవు బుచ్చింపేట, బాగువలస, పురోహితునివలస, బోరబందలో వరి పొలాలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజుల్లో నీటి తడి అందకపోతే వరి పొలాలు పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంది. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో నీటి తడి అవసరం వుంది. ఈ దశలో నీరందకపోతే వరిగింజ పొల్లుగా మారనుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మండలంలో 6,460ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితి కారణంగా ఈ విస్తీర్ణంలో మూడోవంతు దెబ్బ తినే అవకాశం కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో రైతులు
తీవ్ర వర్షాభావ పరిస్థితి కారణంగా వరి పంట చేతికొచ్చే సమయంలో దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగమయ్యారు. వ్యవసాయ బోర్లు ఉన్న రైతులు నీటి తడి అందిస్తున్నారు. లేని రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. పిఎన్ బొడ్డవలస ప్రాంతంలో సాగు చేస్తున్న సుతాపల్లి గోవింద అనే రైతు సుమారు రూ.60వేలు ఖర్చు చేసి తన పొలానికి నీటి తడి అందించే ప్రయత్నం చేస్తున్నారు. పాచిపెంట మండలంలోని చినచీపురువలస, పెదచీపురు వలస, కందరివలస, గుంట మామిడి వలస గ్రామాల రైతులు తలో కొంత డబ్బు ఎత్తుకుని కర్రి వలస ఆనకట్ట ఎడమ కాలువ నీరు అందేలా చర్యలు తీసుకున్నారు.
అప్రమత్తమైన అధికారులు
మండలంలో కరువు మేఘాలు కమ్ముకొస్తున్న తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి మండలంలో ఎండిపోయిన చెరువులను పరిశీలించారు. మండలంలోని పాండీ చెరువుని శనివారం వ్యవసాయ శాఖ ఎడి మధుసూదనరావు, ఎఒ అనురాధ పండా, పెద్దగెడ్డ ఎఇ సంధ్య పరిశీలించారు. పాండీ చెరువుకు 200మీటర్ల దూరం వరకు కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా నీరు వస్తోంది. ఆ నీటిని పాండీ చెరువుకు చేరేలా చేస్తే మండలంలోని మిగిలిన చెరువులకు నీరు సరఫరా అవుతుంది. తద్వారా 2వేల ఎకరాల్లో వరి పొలాలకు నీటితడి అందే అవకాశం ఉంది. కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ నుండి ఉన్న పిల్ల కాలువ పూడిక తీస్తే పాండీ చెరువుకు నీరు చేరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు కూడా పంపించారు. తమ వద్ద నిధులులేవని ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేక దష్టి సారించి నిధులు మంజూరు చేస్తే 200మీటర్ల పిల్ల కాలువ పూడిక తీసే అవకాశం ఉంది. లేకపోతే వారం రోజుల్లో నీటి తడి అందక మండలంలోని 2వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదన పంపించాం
తీవ్ర వర్షాభావ పరిస్థితి కారణంగా మండలంలో 2వేల ఎకరాలకు పైగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. తాజా పరిస్థితిని ఇరిగేషన్ అధికారులకు నివేదించాం. కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా కోస్టువలస నుంచి పాండీ చెరువుకు నీరు చేరేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 200మీటర్ల మేర కాలువ పూడిక తీస్తే పాండీ చెరువుకు నీరు చేరుతుందని చెపుతున్నారు. మండలంలో 25రోజులుగా వర్షాభావ పరిస్థితి నెలకొంది. అక్టోబరులో 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 24 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వారం రోజుల్లో నీటితడి అందకపోతే వరి పంట దెబ్బ తినే అవకాశం కనిపిస్తోంది.
మధుసూదనరావు,వ్యవసాయ శాఖ ఎడి, సాలూరు.
రైతుల ప్రతిపాదన నివేదిస్తాం
కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా కోస్టువలస వరకు నీరు చేరుతుంది. అక్కడ నుంచి కొత్తవలస పాండీ చెరువుకు నీరు చేరేలా కాలువ పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు. 200మీటర్ల పొడవున కాలువ పూడిక తీస్తే పాండీ చెరువుకు నీరు చేరుతుందని రైతులు చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నతాధికారులకు నివేదిస్తాను. పనులు చేయడానికి అంచనాతో నివేదిక అందజేస్తాను. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.
సంధ్య, పెద్దగెడ్డ ఎఇ
15ఏళ్లుగా కోరుతున్నాం
కోస్టువలస వరకు వస్తున్న కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ నీటిని పాండీ చెరువుకు చేరేలా చర్యలు తీసుకోవాలని గత 15ఏళ్లుగా కోరుతున్నాం. దీనిపై స్పందన లేదు. పాండీ చెరువుకు నీరొస్తే మండలంలోని 2వేల ఎకరాల్లో వరి పంటను రక్షించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వరి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే 20మంది రైతులం సొంత డబ్బుతో కొంత వరకు కాలువ పూడిక తీత పనులు చేశాం. కొంతవరకు నీరు చేరింది. దీనికి రూ.60వేలు ఖర్చు చేశాం. మిగిలిన గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలంటే 200మీటర్ల కాలువ పూడిక తీత పనులు చేయాలి.
సుతాపల్లి గోవింద, రైతు.