ప్రజాశక్తి-అనకాపల్లి
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెనూ విద్యార్థులకు ఉపయోగకరంగా లేదని, ఈ మెనూ వండడం సాధ్యం కాదని, మోనూ మార్చాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల విలీనంతో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, దీంతో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎండిఎం కార్మికులను తొలగించడం దారుణమన్నారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, గ్యాస్, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలని, నాణ్యమైన గుడ్లు, బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ శానిటేషన్ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, వారి వేతనాలు పెంచాలని, పని భద్రత కల్పించాలని కోరారు. ఈనెల 18, 19 తేదీల్లో పరవాడలో జరిగే సిఐటియు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె.లక్ష్మి, కె.నాగభూషణం, విజయ కుమారి, జానకి, పార్వతి పాల్గొన్నారు.










