Sep 03,2023 22:59

మాట్లాడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్షి ్మ

ప్రజాశక్తి- పాతపట్నం: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం యూనియన్‌ మండల కార్యదర్శి టి.సీతమ్మ అధ్యక్షతన జరిగిన పాతపట్నం మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండిఎం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ ,ఉద్యోగ భద్రత, పింఛను వంటివి అమలు చేయకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా పథకాన్ని నీరుగార్చేందుకు నిరంతరం బడ్జెట్లో కోతలు పెడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. పథకం అమలుకు పాఠశాలలో వంటషెడ్లు, వంట పాత్రలు, మంచినీరు, గ్యాస్‌ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమన్నారు. దఫదఫాలుగా మెనూలో మార్పులు చేస్తున్నారని, దీనివల్ల ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నా వాటికి అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంపుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిఎం కార్మికలకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి నెలా 5వ తేదిలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచాలని కోరారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదన్నారు. వీటన్నింటిపై కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలపునిచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు కుమారి, లక్ష్మి, శాంతమ్మ, భవాని, ఎం.రామలక్ష్మి, కె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.