ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈ జూన్ 26కు 46 సంవత్సరాలవుతోంది. 1975 నుండి 1977 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజల పౌర హక్కులను హరిస్తే...నేడు కేంద్రంలో పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించకుండానే వివిధ రాజ్యాంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని...ప్రజల హక్కులను హరిస్తూ నిరంకుశ పాలన సాగిస్తోంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 1975 జూన్ 25 అర్థరాత్రే అనేకమంది నాయకుల్ని అరెస్టు చేసింది. 26 ఉదయం ఎమర్జెన్సీని ప్రకటించింది. సిపిఐ(ఎం) అగ్రనాయకులు మాకినేని బసవపున్నయ్యను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. అర్థరాత్రి యం.ఏ.గఫూర్‌తోపాటు వీరన్న-ఆలూరు, కర్నూలు రిటైర్డ్ టీచర్ కర్రెన్న, కొండ్రగుంట వెంకటేశ్వర్లు, జి.జె.రావు లాంటి అనేకమందిని అరెస్టు చేశారు. అరెస్టయిన గఫూర్ 3 రోజులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. చివరికి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లో హెచ్.ఎం.టి సంస్థలో కార్మిక నాయకులు 8 మంది, ఐడిపిఎల్ మందుల కంపెనీలో 9 మంది ఎమర్జెన్సీ కింద అరెస్టు అయ్యారు. ఐ.డి.పి.ఎల్ కార్మిక నాయకుడు నాయర్, హెచ్.ఎం.టి నాయకులు పాండురంగారావు, పద్మారావు లాంటి వారిని ముషీరాబాద్ జైలుకు పంపారు. విశాఖ కార్మిక నాయకుడు గంగాధర రెడ్డిని అరెస్టు చేశారు. పోలీసుల నుండి తప్పించుకున్నవారు రహస్యంగా పని చేస్తూ ఉంటే, 4 నెలల తరువాత ఆంధ్రా యూనివర్శిటీలో బి.వి.రమణారెడ్డి (ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు) అరెస్టయ్యాడు. నేను రాష్ట్ర కేంద్రంలో, నర్సింగరావు, బి.వి.రాఘవులు విశాఖలో రహస్యంగా ఉన్నాము. నన్ను కొంతకాలం తరువాత హైదరాబాద్ కేంద్రంగా యూనివర్సిటీలో పని చేయడానికి పార్టీ పంపింది. హైదరాబాద్‌లో డి.జి.నరసింహారావు అప్పటికే పని చేస్తున్నారు. ఎమర్జెన్సీలో కేవలం కమ్యూనిస్టులనే కాదు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, వ్యక్తుల్ని కూడా జైళ్ళలో తోసేసింది. ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, కాంగ్రెస్ సంస్థలో సంక్షోభంతో ఎమర్జెన్సీ విధించారు. కథలు చాలా ఉన్నా స్థలాభావంతో ఇవ్వడం లేదు.
వ్యత్యాసం
నాడు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ యంత్రం ద్వారా ప్రత్యక్ష నిర్బంధానికి, పౌర హక్కుల అణచివేతకు పూనుకుంది. నేడు దేశంలో హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో బిజెపి ప్రభుత్వం ప్రజలపై అదే నిర్బంధాన్ని, అణచివేతను పరోక్షంగా సాగిస్తోంది. ప్రముఖ ఇటాలియన్ కమ్యూనిస్టు నాయకుడు ఆంటోనియో గ్రాంసీ చెప్పినట్లు ప్రజలపై సాంస్కృతిక, సైద్ధాంతిక ఆధిపత్యం (హెజిమోనీ) నెలకొల్పడం ద్వారా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థను నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని దెబ్బతీయడం ద్వారా పౌరహక్కులను కాలరాస్తున్నది. నయా-ఉదారవాద విధానాలు, హిందూత్వ రాజకీయాల కలయికతో సాగుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలు కార్మిక, కర్షక ఇతర శ్రామిక ప్రజానీకానికి వ్యతిరేకంగా, దేశ విదేశీ కార్పొరేట్‌లకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే పెట్టుబడిదారీ మార్గంలో సాగుతున్నాయి. పెట్టుబడి కేంద్రీకరణ, ఫెడరల్ వ్యవస్థకు అవకాశం లేని ఏకాండ రాజ్యాంగం లక్ష్యంగా నిరంకుశ చట్టాలు సాగుతున్నాయి. కార్మిక కోడ్‌లు, కొత్త వ్యవసాయ చట్టాలు, నూతన విద్యా విధానం లాంటి వాటి ద్వారా ప్రజాస్వామ్యాన్ని భగం చేస్తున్నారు. జిఎస్‌టి ద్వారా రాష్ట్రాల ఆర్థిక వనరులను దెబ్బగొట్టడమేగాక ఫెడరల్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది.
ఎమర్జెన్సీలో ఆనాడు వివిధ పార్టీల నాయకులు కూడా అరెస్టు చేయబడ్డారు. వెంకయ్య నాయుడుతోపాటు బిజెపి రామారావు అరెస్టు కాగా సోషలిస్టు పార్టీ నాయకుడిగా ఉన్న సత్యనారాయణ రెడ్డి, తరిమెల నాగిరెడ్డి తమ్ముడు తరిమెల రామదాసు రెడ్డి, భూమన్, భూమన కరుణాకర్ రెడ్డి (నక్సలైట్లు) ఇలా అనేకమంది మన రాష్ట్రంలో అరెస్టు చేయబడ్డారు. ఆనాడు వివిధ రాజకీయ పార్టీల పీక నొక్కి ప్రజాస్వామ్యాన్ని దెబ్బదీస్తే ఈనాడు కార్మికులు, రైతులు, విద్యార్థులు-ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని జీవన రంగాల్లో బిజెపి తన మత భావజాలంతో పౌరసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బదీస్తోంది. ఆందోళన చేసే వారి హక్కుల్ని హరించి కార్పొరేట్లకు కొమ్ముగాస్తోంది.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సిపిఐ(ఎం) పోరాటం
వర్గ పోరాట సిద్ధాంతానికి కట్టుబడ్డ పార్టీలకు పాలకవర్గాల నిర్బంధాన్ని బట్టి పార్టీ నిర్మాణం ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రకటించగానే సిపిఐ(ఎం) తన నిర్మాణాన్ని రహస్య కార్యకలాపాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించింది. పార్టీ శాఖల్ని, కమిటీల్ని రహస్య కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వం సెన్సారు విధించి స్వతంత్ర మీడియా పీక నొక్కితే కమ్యూనిస్టులు వివిధ మార్గాల్లో సెన్సారు నిబంధనలను అధిగమించి ఎమర్జెన్సీ వ్యతిరేక సందేశాల్ని ప్రజలకందించారు. ప్రజా సమస్యలేకాక నిరంకుశ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో గొంతెత్తి చాటారు. కరపత్రాలు, రహస్య సమావేశాలతో ప్రారంభమై అడపాదడపా సమ్మెలు, ఆందోళనల వరకు సాగించింది. మరోవైపు ఇందిరాగాంధీ ప్రకటించిన 20 సూత్రాల కార్యక్రమంలో 'అభ్యుదయాన్ని' చూసిన సిపిఐ దానిననుసరించి కాంగ్రెస్‌ను బలపర్చింది. బిజెపి కార్యకర్తలు అక్కడక్కడా అరెస్టయినా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన ఉద్యమాల్లో లేరు. కార్మిక హక్కులు, రైతాంగ సమస్యలు వారికి పట్టలేదు. ఆ కాలంలోనే సంజరు గాంధీ అరాచకాలపై ''రాజు వెడలె రవితేజములలరగ'' అంటూ పార్టీ రాసిన కరపత్రాన్ని సికింద్రాబాద్‌లో పంచుతుంటే జయప్రకాష్ అనే విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో కుక్కారు. ఇలా ఎన్నో చోట్ల్ల నిర్బంధాన్ని ఎదుర్కొన్నా ఎమర్జెన్సీ పాలన ఎంతో కాలం సాగదని విశ్వాసాన్ని చాటింది సిపిఐ(యం).
సైద్ధాంతిక-సాంస్కృతిక ఆధిపత్యం
బిజెపి నేడు అధికారం లోకి వచ్చిందంటే అది కార్మిక వర్గ పోరాటాల ద్వారానో, రైతాంగ, ఇతర ప్రజల పోరాటాల ద్వారానో కాదు. హిందూత్వ రాజకీయాల ద్వారా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. అది ప్రధానంగా సాంస్కృతిక రంగంలో ప్రజలపై సాంస్కృతిక, సైద్ధాంతిక ఆధిపత్యం (హెజిమోనీ) సాధించడం ద్వారా గెలిచింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సి, జమ్మూ-కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు, బాబ్రీ మసీదు కూల్చివేసి రామాలయ నిర్మాణం, గోవధ నిషేధం, లవ్-జిహాద్, మత మార్పిడులు, పాకిస్తాన్‌తో కయ్యం వంటి అనేక అంశాలను ఉపయోగించి మెజారిటీ హిందువులను సమీకరించడానికి ప్రయత్నించింది. విద్యారంగంలో మత భావజాలాన్ని, జాతీయ దురహంకారాన్ని చొప్పించింది. భావోద్వేగ సమస్యలను ఉపయోగించుకుని అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం క్రమంగా భారత రాజ్యాంగాన్ని వమ్ము చేసి ఎమర్జెన్సీని తలపించే చర్యలకు పాల్పడుతోంది. న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, ఎన్‌ఐఏ, సిబిఐ లాంటి కేంద్ర సంస్థల స్వతంత్రతను, చివరికి సైన్యం యొక్క స్వతంత్రతను కూడా నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బదీస్తున్నది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, అటవీ హక్కుల చట్టం, కార్మిక కోడ్‌ల పేరుతో తెచ్చిన సవరణలు, రైతు కొత్త చట్టాలు, విద్యుత్ చట్ట సవరణలు ఇలా అన్ని వ్యవస్థల్లో బిజెపి జొరబడి ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం తెచ్చింది. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చింది. ఈ విధంగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీలో రాజ్యాంగ యంత్రం ద్వారా నిరంకుశ చర్యలకు పూనుకుంటే నేడు బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని ఉపయోగించి నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నది.
గ్రాంసీ చెప్పిన విషయాలు గుర్తుంచుకోవాలి
ఇటాలియన్ విప్లవకారుడు ''ఆంటోనియో గ్రాంసీ'' తన జైలు జీవితంలో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని మరింత సుసంపన్నం చేశాడు. బిజెపి మతతత్వంపై పోరాటంలో కమ్యూనిస్టులకు ఆయన చెప్పిన విషయాలు ఎంతగానో తోడ్పడతాయి. పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి కార్మికవర్గ రాజ్యాన్ని నెలకొల్పాలంటే 'ఆర్థిక సంక్షోభాలు వస్తేనే సరిపోదని గ్రాంసీ బలంగా వాదించాడు. ఆర్థిక సంక్షోభాలు మాత్రమే పీడిత వర్గాల పోరాటాల వైపు ప్రజలను నెట్టవు. బలమైన పోరాటాలు మాత్రమే బూర్జువా వర్గపు ధైర్యాన్ని సడలించలేవు. రాజకీయాలు మాత్రమే వ్యూహాత్మకంగా విజయాలకు అవకాశాలు కల్పిస్తాయి' అని ఆయన పేర్కొన్నారు. గ్రాంసీ దృష్టిలో రాజకీయ పోరాటాలు అంటే వర్గ ఆధిపత్యంకోసం జరిగే పోరాటాలు. కేవలం ఆర్థిక రంగంలోనే కాకుండా ప్రజల సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక జీవన రంగాలన్నిటిలోనూ పోరాటం జరిగినప్పుడే మతోన్మాద భావజాలాన్ని ఓడించగలం. ఎమర్జెన్సీ నిరంకుశ పరిపాలనను మననం చేసుకోవడం అంటే నేటి బిజెపి పాలనలో వ్యవస్థలు ఒక్కొక్కటిగా మత, జాతీయ దురహంకారం ప్రభావంలోకి జారిపోకుండా పోరాడాలి. ఇదే ఈరోజు నిజమైన మన కర్తవ్యం.
వర్గపోరాటం ప్రాధాన్యత
ఎమర్జెన్సీ నిరంకుశత్వాన్ని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఎదుర్కోగలిగిందంటే దాని వర్గ రాజకీయాలే కారణం. ఆ మాటకొస్తే జాతీయోద్యమ రోజుల్లోగానీ, ఎమర్జెన్సీకి ముందు బెంగాల్‌లో కాంగ్రెస్ సాగించిన సెమీ ఫాసిస్టు టెర్రర్‌ను ఎదుర్కోవలసి వచ్చినప్పుడుగానీ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి తోడ్పడిన అంశం వర్గ పోరాట రాజకీయాలే. విశాఖపట్నంలో జరిగిన సిపిఐ(ఎం) 21వ మహాసభ గత 25 ఏళ్ల అనుభవాలను సమీక్షించి వర్గ పోరాట రాజకీయాల ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. హైదరాబాదులో జరిగిన 22వ మహాసభ దాన్ని పునరుద్ఘాటించింది. పార్టీ రాజకీయంగా విస్తరించాలంటే స్వతంత్ర కృషి చేస్తూ 'వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరించడానికి వర్గ పోరాటాలకు ప్రాధాన్యత ఇవ్వాలి' అని పిలుపునిచ్చింది. 'ప్రజాపంథాను అమలు చేసి ప్రజాపునాది పెంచాలంది. 'మతోన్మాద, నయా-ఉదారవాద, తిరోగమన వాదాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేయాలని' నిర్దేశించింది.
కర్తవ్యం
ఆర్థిక సంక్షోభం ముదిరితే దోపిడీ వర్గాలు శ్రామిక ప్రజలమీద మరింతగా భారాలు మోపుతాయి. తమకు తాము ప్రయోజనం పొందడానికి కొత్త కొత్త చట్టాలు తెస్తాయి. ఇలా వారు తీసుకుంటున్న ప్రతి చర్యా మరింత సంక్షోభానికి కారణమవుతుంది. ప్రజలు మరిన్ని ఇక్కట్లకు గురవుతారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమలుజేస్తున్న ప్రతి చర్య దీనినే విదితం చేస్తోంది. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద భావజాలాన్ని, కార్పొరేట్ కొమ్ముగాసే ప్రయివేటీకరణ విధానాల్ని ఏకకాలంలో ఎదిరించే కర్తవ్యం ఈ రోజు మన ముందుండాలి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ఏకకాలంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నిటికీ సహకరించే శక్తి సమకూరుతుంది.
- పెనుమల్లి మధు / వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /










