Jan 27,2021 07:00

మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విద్యా విధానంలో పెనుమార్పులు చేస్తున్నది. అందులో భాగంగానే ఉన్నత విద్యను ప్రైవేటుపరం చేయాలని, విద్యా బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకోవాలని నిర్ణయించింది. స్వయంగా మోడీ చెప్పిన విషయం ఇది. మోడీ రూపొందించిన విద్యా విధానాన్ని యథాతథంగా అమలుకు జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో మహారాజా కాలేజీ ఎయిడెడ్‌ కాలేజీగా కొనసాగుతుందని భ్రమలు వద్దు.కాలేజీ రక్షణకు అప్రమత్తమై ఉండాలి.
    విజయనగరం మహారాజా కళాశాలలో ఎయిడెడ్‌ సెక్షన్లను నిలబెట్టుకోవడం ఘన విజయమే. మహారాజా కాలేజీ సుదీర్ఘ కాలం విద్యాభివృద్ధికి అమోఘమైన కృషి చేసింది. అందువలనే కాలేజీ కనుమరుగయ్యే ప్రమాదం చూసి ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగింది. అనేక మంది ప్రత్యక్షంగా ఉద్యమంలోకి రాకపోయినా కాలేజీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం విజయవంతం కావాలని వారంతా మనసారా బలపర్చారు. అనేక సంఘాలు, సంస్థలు, వ్యక్తులు ప్రత్యక్షంగా బలపర్చారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) మాత్రం పట్టు సడలించకుండా పోరాడింది. కరోనా కారణంగా కాలేజీ తెరవకపోవడం, పైగా ఉద్యమం చూసి యాజమాన్యం భయపడి విద్యార్థులు కాలేజీకి రాకుండా చేసేందుకు క్లాసులు వాయిదా వేయడం వంటి కుయుక్తులు పన్నింది. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నా లెక్కచేయక, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కరోనా బారిన పడినా వెనకడుగు వేయకుండా కాలేజీ పరిరక్షణకు పట్టుదలగా పోరాడారు.


                                              మోసం బట్టబయలైంది

         మహారాజా కాలేజీ సమస్యపై పత్రికా ప్రతినిధులు మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించగా అది గజపతిరాజుల కుటుంబ వ్యవహారమని, అందులో ప్రభుత్వం కలుగ చేసుకోదని సమాధానం చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకత్వం విద్యా శాఖ మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వగా వారూ ఇదేవిధమైన సమాధానమే ఇచ్చారు. అదే నిజమైతే ప్రభుత్వం జీఓ ద్వారా మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతి రాజును తొలగించి సంచయిత గజపతిరాజును చైర్‌పర్సన్‌గా ఎలా నియమించింది? గజపతుల కుటుంబ సమస్యే అయితే ప్రభుత్వం ఎందుకు అందులో తలదూర్చింది? ఎయిడెడ్‌ కాలేజీలో ప్రభుత్వ అనుమతి లేకుండా డిగ్రీ, ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లను ఎలా నిలిపివేసింది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం, మంత్రుల వద్ద సమాధానం లేదు. ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన వారిని మాన్సాస్‌ చైర్‌పర్సన్‌గా నియమించుకుని మహారాజా కాలేజీని స్వంతం చేసుకొనేందుకు వేసిన స్కెచ్‌ గా అందరూ భావించాల్సి వచ్చింది.


                                            ముప్పు పొంచే వుంది
       మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విద్యా విధానంలో పెనుమార్పులు చేస్తున్నది. అందులో భాగంగానే ఉన్నత విద్యను ప్రైవేటుపరం చేయాలని, విద్యా బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకోవాలని నిర్ణయించింది. స్వయంగా మోడీ చెప్పిన విషయం ఇది. మోడీ రూపొందించిన విద్యా విధానాన్ని యథాతథంగా అమలుకు జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో మహారాజా కాలేజీ ఎయిడెడ్‌ కాలేజీగా కొనసాగుతుందని భ్రమలు వద్దు. ఈ సంవత్సరం కాకుంటే వచ్చే ఏడాది ప్రైవేటుపరం చేయడానికి వెనుకాడరు. కనుక విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గమనంలో ఉంచుకొని కాలేజీ రక్షణకు అప్రమత్తమై ఉండాలి.


                                        ...కాలేజీ ప్రభుత్వ పరం కాలేదు
     దేశంలో రాజరిక వ్యవస్థ రాజ్యం ఏలుతున్న రోజుల్లో విజయనగరం రాజులు మహారాజా పేరుతో తొలుత హైస్కూల్‌ స్థాపించి క్రమేణా కాలేజిగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసినా...విద్యా సంస్థలు, దేవాలయాలు, పరిశ్రమల నిర్వహణకు ట్రస్టుల పేరుతో భూములు ఉంచుకునేందుకు ఎస్టేట్‌ ఎబాలిషన్‌ యాక్టులో లొసుగులను పెట్టారు. వాటిని ఉపయోగించుకొని గజపతి రాజులు మాన్సాస్‌ ట్రస్టును ఏర్పరచి మహారాజా హైస్కూలు, కాలేజీలను అందులో భాగం చేశారు. వాటి నిర్వహణకు వేల ఎకరాల భూమిని ట్రస్టులో ఉంచుకున్నారు. ఆ ట్రస్తుపై వంశపారంపర్యంగా తమ కుటుంబ పెత్తనం ఉండేలా చేసుకున్నారు. లేకుంటే ఆనాడే ఎం.ఆర్‌ కాలేజీ ప్రభుత్వపరం అయ్యేది. అనంతరం బిఇడి, మహిళా కాలేజీలకు విస్తరించింది. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఎయిడ్‌ ఇచ్చింది. అధ్యాపకులకు జీతభత్యాలు, బిల్డింగులు, లాబొరేటరీలు, గ్రంథాలయం అన్నింటికీ ప్రభుత్వం ఎయిడ్‌ ఇచ్చింది. అందువలన మాన్సాస్‌ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థల వలే ఫీజులు లేకుండా నడిచాయి. విజయనగరంలో ప్రభుత్వ కాలేజీల అవసరం రాలేదు. ప్రజలు, ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించ లేదు. ఎం.ఆర్‌ కాలేజీకి రాబోయే ముప్పును గమనించిన సిపిఎం ప్రభుత్వ కళాశాల అవసరాన్ని లేవనెత్తింది. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ అదే డిమాండ్‌ తో పోరాడగా ఎట్టకేలకు మొదట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ తరువాత అందులోనే డిగ్రీ సెక్షన్లు ప్రారంభించారు.


                                                  ప్రపంచ బ్యాంకు షరతులతోనే ఈ దుస్థితి
      ప్రపంచ బ్యాంకు షరతులలో భాగంగా విద్యను ప్రైవేటు పరం చేయాలని కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌, వాజ్‌పేయి, రాష్ట్రంలో చంద్రబాబు, అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలు అన్నీ అదే దారిలో నడిచాయి. సిపిఎం, వామపక్షాలు మినహా అన్ని పార్టీలదీ అదే దారి. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చే ఎయిడ్‌ను తగ్గిస్తూ పోతున్నది. ఖాళీ అయిన ఎయిడెడ్‌ అధ్యాపకులు, టీచర్ల నియామకం నిలిపివేశారు. అందువలన కాంట్రాక్టు అధ్యాపక సిబ్బందిని కాలేజీ నియమించాల్సి వస్తున్నది. దశాబ్దాలు పనిచేసినా సిబ్బంది రెగ్యులర్‌ కావడం లేదు. అతి తక్కువ వేతనాలతో వారు కాలం వెళ్ళదీస్తున్నారు.
     మారోపైపు ప్రభుత్వం నుండి ఎయిడ్‌ తగ్గిపోవడంతో సిబ్బంది జీతాలకు, ఇతర ఖర్చులకు విద్యార్థులపై ఫీజులు పెంచుతున్నారు. ఎం.ఆర్‌ హాస్టల్‌ ను కూడా ప్రైవేటుపరం చేశారు. అక్కడ పని చేసే సిబ్బందిని తొలగించారు. క్రమంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడం మోడీ ప్రకటిత విద్యా విధానం. అందులో భాగంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎయిడ్‌ లేకుండా కాలేజీని నడుపుకుంటారా లేక ప్రభుత్వంలో విలీనం చేస్తారా? అనడిగింది. అదే అదునుగా విజయనగరం నడిబొడ్డున వందల కోట్ల విలువ చేసే భూమిని కాజేయడానికి మాన్సాస్‌, ప్రభుత్వ పెద్దలు ఒక్కటై ఎం.ఆర్‌ కాలేజీని అన్‌-ఎయిడెడ్‌గా మార్చడానికి సిద్ధమయ్యారు.
    అందులో భాగంగానే డిగ్రీ, ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు రద్దు చేయడం, ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులపై ఒత్తిడి చేసి టి.సి.లు బలవంతంగా ఇచ్చేయడం వంటి అక్రమాలకు యాజమాన్యం ఒడిగట్టింది. అంతిమంగా కాలేజీని ఎత్తివేసో లేక అక్కడ నుండి తరలించో విలువైన భూమిని కాజేయడం కోసం మాన్సాస్‌, ప్రభుత్వం పన్నిన కుట్రను విద్యార్ధులు, అధ్యాపకులు... ప్రజా సంఘాల మద్దతుతో విజయవంతంగా తిప్పికొట్టారు. ఇది గొప్ప విజయమే. అయినా విజయం తాత్కాలికమే. ఎం.ఆర్‌ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడే నిజమైన విజయం. అందుకు విరామమెరుగక ఉద్యమాన్ని కొనసాగించడమే సరైన మార్గం.

(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
ఎం.కృష్ణమూర్తి

m.kr