ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరును కరువు మండలంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు గోవిందు, తాలూకా అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కలగొట్ల ఆర్‌బికె వద్ద రైతు సంఘం, ఎపి కౌలు రైతు సంఘం, వ్యకాస, (ఎఐఎడబ్ల్యుయు) సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాభావంతో దెబ్బతిన్న అన్ని ప్రాంతాలను కరువుగా గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నష్టపోయిన రైతులు, కౌలురైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట నష్ట పరిహారాన్ని ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట వేయని రైతులకు రూ.20 వేల జీవన భృతిగా ఇవ్వాలని, రైతులు, కౌలు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు, ప్రతి కుటుంబానికీ జీవనోపాధి కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ బియ్యం, కందిపప్పు, గోధుమలు, మంచి నూనె, చక్కెర వంటి 14 రకాల నిత్యావసర వస్తువులు చౌక డిపోల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందించాలని కోరారు. రైతు సంఘం నాయకులు అబ్దుల్లా, రాజు, సుభాన్, రాముడు, బాష, గౌడు, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్, కెవిపిఎస్ నాయకులు కలగొట్ల రాజు, కరువు బారిన పడిన రైతులు పాల్గొన్నారు.
వినతిపత్రం అందిస్తున్న ప్రజా సంఘాల నాయకులు










