Oct 19,2023 19:54

మాట్లాడుతున్న బీఎస్పీ నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
రూ.కోట్లు ఖర్చు చేసి ఎమ్మిగనూరుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెనుదిరిగారని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎర్రన్నలు విమర్శించారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మిగనూరు ప్రాంత రైతులకు, చేనేతలకు, దళితులకు, బీసీలకు, మహిళలకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే ముఖ్యమంత్రి వెళ్లిపోయారని తెలిపారు. ఈ ప్రాంతంలో తుంగభద్ర నది ఉన్నా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పంట నష్టంపై ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రైతులకు ఏం న్యాయం చేస్తారో చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు ఆసరాగా నిలిచే టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. పోస్టాఫీస్‌ ఎదురుగా కేటాయించిన దాదాపు 50 సెంట్ల స్థలంలో వాల్మీకి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మొండి చేయి చూపించారని విమర్శించారు. జిల్లాలో వేదవతి, గురు రాఘవేంద్ర, గుండ్రేవుల, ఆర్‌డిఎస్‌ కుడికాలువ నిర్మించాలని కోరారు. బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎద్దుల నాగేష్‌ పాల్గొన్నారు.