ప్రజాశక్తి- పెదబయలు :మూడు రాజధానులపై వైసిపి ఎమ్మెల్యేల రాజీనామా ఒక డ్రామా అని, విభజన చట్టంలో హామీలకై రాజీనామా చేసే దమ్ముందా అని మాజీ మంత్రి, టిడిపి అరకు నియోజకవర్గం ఇంచార్జి కిడారి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. విలేకర్లతో ఆయన ఆదివారం మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు అపాలని వైసిపి ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను దారి మల్లించడానికి డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాజీనామాలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హౌదా, రైల్వే జోన్ తేవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎం పిలు రాజీనామాలు చేసే దమ్ముందా ప్రశ్నించారు. ఒక్క వైసిపి ఎంపీ కూడా విభజన హామీల కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించ లేదన్నారు. ఈ కార్యక్రమంలో దారెలా సర్పంచ్ పాంగి పాండురంగస్వామి, మాజీ సర్పంచ్ టి.త్రినాద్. ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి సాగర సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ నాయుడు పాల్గొన్నారు.










