పార్వతీపురం రూరల్: మండలంలోని డికె పట్నంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరసన సెగ తగిలింది. దీర్ఘకాలంగా తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన యువత నిలదీసింది. దీంతో సమాధానాన్ని దాటవేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కారుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన విరాలిలా ఉన్నాయి. మండలంలోని డికె పట్నంలో స్థానిక తహశీల్దార్ కె.శివన్నారాయణ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జోగారావును గ్రామానికి చెందిన గిరిజన యువత తాగునీటి సమస్యపై నిలదీశారు. వీరి ఆందోళనకు జనసేన కార్యకర్తలు తోడయ్యారు. చాలా కాలంగా తాగునీటి సమస్య మీ దృష్టికి తీసుకొచ్చామని, సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారంంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా దీనిపై వివరణ ఇస్తానని తెలిపారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే తన వాహనంలో డోకిశీలలో జరిగే కార్యక్రమానికి ఆదరాబాదరాగా బయలుదేరారు. సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వెళ్లిపోవడమేమిటని జనసేన కార్యకర్తలు, యువకులు ఆగ్రహించారు. దీనికి పరిష్కారం వెంటనే సూచించాలని ఎమ్మెల్యే వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను తొలగించి ఎమ్మెల్యే వాహనాన్ని పంపారు. దీంతో కార్యకర్తలు, యువకులు మరింత అసహనాన్ని తహశీల్దార్ శివన్నారాయణ ముందు ప్రదర్శించారు. దీంతో తహశీల్దార్ మోసూరు శ్రీరాములు, పెంట రామకష్ణ, ముంగి రాంబాబు, రాయిపల్లి రమేష్ అనే వారిపై విధులకు ఆటంకం కలిగించారని రూరల్ పోలీస్ స్టేషన్లో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన సిఐ స్వామినాయుడు నేతత్వంలో నలుగురు యువకులను స్టేషన్‌కు రప్పించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ నాయకులు చందక అనిల్, వి.దాలినాయుడు, ఆరిక మోహనరావు, తదితరులతోపాటు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు నలుగురి దగ్గర వ్యక్తిగత పూచికత్తు తీసుకొని విడుదల చేయడంతో సమస్య సద్దుమణిగింది.










