Apr 02,2023 00:26

ఎమ్మెల్యేను నిలదీయడానికి వెళ్తున్న గిరిజనులు, గిరిజన నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించని గిరిజన ఎమ్మెల్యేలకు ఆదివాసీల నుండి నిరసనలు మొదలయ్యాయి. ఆసరా పథకం చెక్కులు పంపిణీ చేసేందుకు శనివారం రాజవొమ్మంగి వచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి నిరసన సెగ తగిలింది. గిరిజన సంఘం, ఆదివాసీ జేఏసీ నాయకులు కొండ్ల సూరిబాబు, వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, తెడ్ల అబ్బాయి, కుజం జగన్నాథం ఆధ్వర్యాన గిరిజనులు స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఉన్న ఎమ్మెల్యేను ప్రభుత్వం తీసుకొచ్చిన 52 జీవోపై ప్రశ్నించడానికి వెళ్లారు. అయితే రాజవొమ్మంగి సిఐ బాజీలాల్‌ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్సైలు టీజీ నరేంద్ర ప్రసాద్‌, షరీఫ్‌ వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ధనలక్ష్మిని కలవడానికి మూకుమ్మడిగా వెళ్లడానికి వీల్లేదని, పదిమంది నాయకులు వచ్చి ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. అందుకు వారు అంగీకరించలేదు. తామందరమూ కలిసి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తామని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె సమాధానం చెప్పాలని గిరిజనులు పట్టుబట్టారు. దీంతో పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గిరిజనులు పోలీసులను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిగా సేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఎమ్మెల్యే అక్కడ నుండి వెళ్లిపోవడంతో స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద గిరిజన నాయకులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ కోసం కన్వీనర్‌ కమిటీ ఏర్పాటు చేశారు. జీవో నెంబర్‌ 52ను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, ఆదివాసీ జేఏసీ నాయకులు బి రామకృష్ణ, వి అప్పారావు, ఈ శ్రీను, జి పెద్దిరాజు, ఏ సుబ్బలక్ష్మి, జి రమణి, ఎం గణలక్మి, తెడ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.