Apr 06,2023 00:52

ఘర్షణ పడుతున్న ఇరు వర్గీయులు

ప్రజాశక్తి- నక్కపల్లి:మండల కేంద్రమైన నక్కపల్లిలో బుధవారం ఎస్సీ కాలనీలో బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బాబురావు వర్గీయులు, వ్యతిరేక వర్గీయులు వీసం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా స్థానిక దళిత యువకులు ఎమ్మెల్యే బాబురావు, ఆయన వర్గీయులను, వ్యతిరేక వర్గీయులైన రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణతో పాటు తెలుగుదేశం, బిజెపి, ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముందుగా బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన వర్గీయులతో సభ వేదిక వద్దకు వెళ్లారు. అనంతరం రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ వర్గీయులు ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పీటీసీ కాసులమ్మ, గ్రామ సర్పంచ్‌ జయ రత్న కుమారి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీసం నానాజీ, ఈశ్వరరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పాపారావు, మణి రాజు, తదితరులు బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు.
స్థానిక దళిత నాయకులు, మహిళలు వీసం వెంట ఉండి ఊరేగింపుగా వీసం రామకృష్ణ వర్గీయులను వేదిక మీదకు వెళ్లారు. వీసం రామకృష్ణ మైక్‌ తీసుకొని ప్రోటోకాల్‌ ప్రకారం అందరిని వేదికపై పిలుస్తుండగా, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు పిలవకుండా స్టేజ్‌ పైకి రావడంతో వీసం అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సమక్షంలో ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాట జరిగింది. ఉద్రిక్తత వాతావరణంలో గొడవ జరుగుతుండగా ఎమ్మెల్యే బాబురావును పోలీసులు అక్కడ నుండి కారు వద్దకు తీసుకువెళ్లి పంపించారు. దీంతో, వీసం వర్గీయులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. గొడవకు కారణమైన ఎమ్మెల్యే వర్గీయులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి. అనంతరం వీసం వర్గీయులు ఎంపీపీ రత్నం, సర్పంచ్‌ జయ రత్నకుమారి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీసం నానాజీ, శ్రీను, రాజులతో పాటు బాబు జగ్జీవన్‌ రామ్‌ దళిత యూత్‌, మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేసారు. గొడవకు కారణమైన ఎమ్మెల్యే వర్గీయులపై చర్యలు తీసుకోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేసారు. ఈ ఘర్షణలో వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, పాపారావు, మణి రాజు లకు స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసులకు ఎంపీపీ రత్నం ఫిర్యాదు
ఎమ్మెల్యే బాబురావు వర్గీయులు యలమంచిలి తాతబాబు, శీరం నరసింహమూర్తి, కోర్ని రమేష్‌లు స్టేజి మీదకు పిలవకుండా వచ్చి ఘర్షణకు దిగారని, తనతో పాటు పలువురు నేతలకు గాయాలయ్యాయని, ఇందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎంపిపి రత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వర్గీయులైన ముగ్గురు నాయకులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు పట్టుబట్టారు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన దగ్గర నుండి రాత్రి 9 గంటల వరకు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగించారు.ఈ మేరకు ఎస్‌ఐ శిరీష కేసు నమోదు చేసినట్లు వెల్లడించడంతో ఆందోళన విరమించారు .