ప్రజాశక్తి-మార్టూరు రూరల్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిపై అసెంబ్లీ సాక్షిగా జరిగిన దాడి ఘటన ప్రజాస్వామ్యానికి అవమానకరమని, చరిత్రలో ఇది చీకటి రోజని టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన డోలా బాల వీరాంజనేయస్వామిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీ మూకల్లా వచ్చి భౌతికదాడి చేయడం అమానుషం అన్నారు. జీవో నంబర్ 1పై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరేందుకు వెళ్లామని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరామని అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా మూకుముడిగా వచ్చి అక్కడ ఉన్న కొండపి ఎమ్మెల్యే స్వామిపై సంతనూతలపాడు, చింతల పూడి ఎమ్మెల్యేలు సుధాకర్, ఎలీజా దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఓటమిని జీర్ణించుకోలేక పక్కా ప్లాను ప్రకారం, యుద్ధ వాతావరణం తలపించేలా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వామిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మానసికంగా కంట్రోల్లో లేకుండా ఇలా దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఏలూరి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ఉన్న జీవో నెంబర్ 1 రద్దు చర్చకు పట్టుపడితే అసెంబ్లీ సాక్షిగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి ఎమ్మెల్యేలు దారుణంగా ప్రవర్తించారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. శాసనసభ్యునిపై కొందరు పశువుల్లాగా ప్రవర్తించారని, దళిత శాసనసభ్యుడు ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్న సమయంలో ఆయనపై దళిత శాసన సభ్యులను ఉసిగొల్పి దాడి చేయించడం, అసెంబ్లీకే కళంకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమయిం దని, ప్రజాక్షేత్రంలో వారికి త్వరలో గుణపాఠం తప్పదని ఏలూరి హెచ్చరించారు.










