ప్రజాశక్తి- అరకులోయ రూరల్: జగనన్న నువ్వే మా నమ్మకం, గడపగడపక కార్యక్రమంకు శనివారం బస్కి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మహిళలు, గిరిజన సఘం నాయకులు ఖాళీ బిందెలతో నిరసనతో స్వాగతం పలికారు. గ్రామంలో మంచినీటి సమస్యలు పరిష్కరించాలని, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బస్కి గ్రామంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చూపించాలని మహిళలు నిలదీశారు. బస్కీ పంచాయితి కేంద్రంలోని మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తక్షణమే పరిష్కరించాలని మండిపడ్డారు. బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓట్ల రాజకీయం కోసం ఆదివాసి గిరిజనులను ద్రోహం చేస్తే సహించేది లేదన్నారు. బస్కి గ్రామంలో మంచినీరు, సిసి రోడ్డు, డ్రైనేజీ, అరకువేలి నుండి బస్కి పంచాయితీ వరకు తారు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, బస్కి సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రంగనీగుడ, కొంత్రాయిగూడలో మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే, అధికారులు వైసిపి నాయకులు పోలీసుల సహాయంతో గ్రామం నుంచి వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎస్.కృతష్ణమూర్తి, పొత్తి, ఎస్.మధు, కె ప్రహ్లాద్, ఎస్.చంటి, వీరూతమ్మ, ఇంద్ర, సావిత్రి పాల్గొన్నారు.










