May 09,2023 00:03

రోడ్డుపై బైఠాయించిన నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో బాగంగా సోమవారం బస్కి పంచాయతిలో పర్యటించిన ఎమ్మెల్యే చెట్టి పాల్గుణను సిపిఎం, టిడిపి నాయకులు, మహిళలు నిలదీశారు. మూడేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఏమి చేశారో చెప్పాలంటూ గిరిజనులు ప్రశ్నించారు. బోయ/ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. గిరిజన ఎమ్మెల్యే అయ్యి గిరిజన జాతికి తీవ్రమైన ద్రోహం చేశారని నిలదీశారు. బస్కి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గడప గడప కార్యక్రమం పేరుతో గిరిజనులకు మోస పూరితమైన మాటలతో మభ్యపెట్ట వద్దని ప్రశ్నించారు. బస్కి పంచాయతీలో చేసిన అభివద్ధి ఏ ఒక్కటైనా చూపించాలని సీపీఎం మండల కార్యదర్శి కె.రామారావు నిలదీశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బస్కీ పంచాయతీలోని వివిధ గ్రామాల్లో మంచినీరు, రోడ్డు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. రంగినిగుడ, కొంత్రాయిగూడ గ్రామాల్లో ప్రారంభించిన మంచినీటి పథకం అసంపూర్తిగా వదిలేశారని ఎందుకు పట్టించకోలేదని ప్రశ్నించారు.బొండగూడ గ్రామంలో పాఠశాల లేక పశువుల పాకలో విద్యాబోధన జరుగుతుందని మహిళలు తెలిపారు. పేద విద్యార్థులకు విద్య అందించే పాఠశాల భవనం నిర్మించలేని ప్రభుత్వం మనకు అవసరం లేదన్నారు.అరకువెళ్లి నుండి బస్కి పంచాయతీ వెళ్ళే దారి మరమ్మతులు చేపట్టాలని ఎన్ని సార్లు పిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బోయ/ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించే తీర్మానాన్ని వ్యతిరేకించి ఆదివాసి గిరిజనుల వైపు నిలబడి పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా తమతో పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాంగి రాజు, పాంగి భీష్మ, సమర్డి బాబురావు, జి.రామన్న, గొల్లోరి అప్పలనాయుడు, కంజరితోట వార్డు మెంబర్‌ పాంగి బలరాం, పాంగి జగన్నాథం, టిడిపి నాయకులు కొర్రా మాణిక్యం, సమర్డి లైచోన్‌, కిండంగి సన్యాసి, వంతల గోపాల్‌ నాయుడు, సమర్డి ఆనంద్‌, రాజు, డొంబు, మదు, కిరణ్‌ పాల్గొన్నారు.