Apr 12,2023 23:55

రోడ్డుపై బైఠాయించిన గిరిజన సంఘం నేతలు

ప్రజాశక్తి-హుకుంపేట:స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల పక్కన గ్రౌండ్లో వైయస్సార్‌ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే ఫాల్గుణకు నిరసన సెగ తగిలింది. బోయ/వాల్మీకి బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ముందుగా రోడ్డుపై బైఠాయించిన గిరిజన సంఘం నేతలు ఎమ్మెల్యే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అనంతరం గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంఘం ఆఫీస్‌ నుంచి ప్రాంగణం వరకు ర్యాలీ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. గిరిజన ద్రోహి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆందోళన చేశారు. బోయ/వాల్మీకి బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజన ఎమ్మెల్యేగా ఎందుకు తిరస్కరించలేదంటూ ప్రశ్నించారు. బోయ వాల్మీకి తీర్మానం ఎమ్మెల్యే వైఖరి బహిర్గతం చేయాలని, ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కృష్ణారావు, లక్ష్మణరావు,వైస్‌ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఈ విషయమై చట్టసభల్లో ఎందుకు ప్రశ్నించలేదని వారు నిలదీశారు. గిరిజన హక్కులు, చట్టాలను కాపాడేందుకు నమ్మి ఆందోలం ఎక్కిస్తే నిజమైన గిరిజనులకు నష్టం జరుగుతున్నా నోరు మెదపకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. సొంత ప్రయోజనాల కోసం గిరిజనులను తాకట్టు పెట్టడం సరైనది కాదని వారు అన్నారు. బోయ/వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, వీరిని ఎస్టి జాబితాలో చేరిస్తే నిజమైన గిరిజనులకు ముప్పు వాటిల్లుతుందన్నారు. వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని వారు కోరారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు మాజీ సర్పంచ్‌ లక్ష్మి, ప్రమీల, ప్రజా సంఘం నేతలు పాల్గొన్నారు.