Aug 18,2023 00:56

సమావేశంలో వాదులాడుకుంటున్న కార్పొరేటర్లు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం గురువారం వాడివేడిగా కొనసాగింది. సమావేశానికి మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అధ్యక్షత వహించారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో జాప్యంపై అధికారులపై పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వచ్చిన ఎమ్మెల్యే ముస్తాఫా మేయర్‌ కావటిపై నిప్పులు చెరిగారు. ఒక దశలో ఏకవచన పద ప్రయోగం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడంలేదని, లాభసాటి పనులే చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో తాను కాంట్రాక్టు పనులు చేసే వాడినని, మీ వల్లే పనులు చేయడం మానేయడం వల్ల రూ.4 కోట్లు నష్టపోయానని దెప్పిపొడిచారు. మిమ్మల్ని మేయర్‌ సీట్లో కూర్చొబెడితే ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మేం ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆగస్టు 15న మీరు జెండా వందనం చేస్తామంటే నేను, కార్పొరేటర్లు ముందే వచ్చాం.. మీరు వచ్చే వరకుపక్క గదిలో వేచి ఉన్నాం.. మీరు మమ్మల్ని పిలవకుండా జెండా ఎగుర వేసి వేళ్లిపోయారు... ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు. మేయర్‌గా మీ బాధ్యతలు నిర్వహించడం లేదని, నియోజకవర్గంలో తనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తున్నారని విమర్శించారు. 14వ డివిజన్‌లో రూ.7.70 కోట్ల పనులకు మంజూరు చేసి రూ.60 లక్షల పనులు చేశారన్నారు. ఈ క్రమంలో మేయర్‌కు, ఎమ్మెల్యేకు వాగ్వావాదం జరిగింది. ఈ దశలో టిడిపి పక్ష నాయకుడు కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడుకుంటున్నారని అన్నారు.
తాను ఎవరి డివిజన్‌లో పనులు ఆపలేదని, ఏ కాంట్రాక్టరును టెండరు వేయకుండా చేయలేదని మేయర్‌ అన్నారు. 14వ వార్డుపై ఎందుకు వివక్ష అని ఎమ్మెల్యే ప్రశ్నించగా కాంట్రాక్టరుకు యాక్సిడెంట్‌ అవ్వడం వల్ల పనులు ప్రారంభం కాలేదని ఎస్‌ఇ భాస్కరరావు సమాధానమిచ్చారు. గతంలో కూడా తాను ఇదే విధంగా గట్టిగా మాట్లాటడం వల్ల కొన్ని పనులు జరిగాయని, ఇంకా జరగాల్సి ఉందని ముస్తాఫా అన్నారు. నాతో పనులు చేయనివ్వకుండా అంతుచూస్తామన్నారు.. చూశారు. మీ లాగా నాకూ తెలుసూ... తాళం వేయడం తెలుసు. తీయడం తెలుసు అన్నారు. ఆటోనగర్‌లో రూ.10 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో వైసిపి కార్పొరేటర్లు రెండుగా చీలిపోయి కొరత మంది ఎమ్మెల్యేకు అనుకూలంగా, మరికొంత మంది మేయర్‌కు అనుకూలంగా మాట్లాడారు. తమ వార్డులో పనులు జరగడంలేదని ముస్తాఫా గ్రూపునకు చెందిన ముగ్గురు మహిళా కార్పొరేటర్లు విమర్శలు చేశారు. తన వార్డులో పనులు జరగడం లేదని డిప్యూటీ మేయర్‌ సజీల తన వాదన విన్పించారు. దీంతో కార్పొరేటర్ల మధ్య పలు మార్లు వాగ్వావాదం చోటుచేసుకుంది. ఒక దశలో తీవ్ర గందరగోళం మధ్య సమావేశానికి వాయిదా వేయాలని మేయర్‌ భావించారు. తరువాత ప్రతిపాదన విరమించుకుని కొనసాగించారు. ఈ దశలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ సభను మేయర్‌ ఆర్డర్‌లో పెట్టాలన్నారు. ఎవరికి వారు మాట్లాడుకుని వాగ్వావాదం చేసుకుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు.
సమావేశం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. అంతకు ముందు ఎన్‌టిఆర్‌ స్డేడియంలో కార్పొరేటర్ల కుటుంబాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై చర్చించారు. కార్పొరేటర్లుకు ఉచితంగా సభ్యత్వం ఇవ్వాలని పలువురు కోరారు. ఇందుకు నిబంధనలు మారుస్తూ తీర్మానం చేయాలన్నారు. 1995లో ఒక్కొక్కరు రూ.5 వేలు చెల్లించారని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తెలిపారు. పలు తర్జన భర్జనల అనంతరం 10 మంది కార్పొరేటర్లు, అధికారులతో కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలని డిప్యూటీ వనమ బాలవజ్రబాబు కోరారు. ఈ అంశంపైగతంలోనే ఎంపి గల్లా జయదేవ్‌ కేంద్రానికి లేఖ రాశారని, ఇది కేంద్రం పరిశీలనలో ఉందని టిడిపి కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ పేర్కొన్నారు. దీనిపై టిడిపి, వైసిపి కార్పొరేటర్ల మధ్య వాగ్వావాదం జరిగింది. ఎంపి కనిపించడం లేదని వైసిపి కార్పొరేటర్లు అనగా సిఎం కన్పించడం లేదని టిడిపి కార్పొరేటర్లు అన్నారు. హోర్డింగ్‌లపై చర్చ సందర్భంగా కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డిపై సిటీప్లానర్‌ అనుచితంగా మాట్లాడి తరువాత క్షమాపణ చెప్పారు.
భూగర్భ డ్రెయినేజి పనులను పూర్తి చేయండి : ఎమ్మెల్సీ లక్ష్మణరావు
అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రెయినేజి పనులను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు కోరారు. ఈ పనులు చేపట్టడానికి పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో చర్చించాలన్నారు. దీనిపై ఎస్‌ఇ భాస్కరరావు మాట్లాడుతూ ఈ అంశం జిల్లా కలెక్టర్‌ పరిశీలిస్తున్నారని, సిఎంఒ అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనులు పూర్తి చేయాలని లక్ష్మణరావు కోరారు. నార్ల వెంకటేశ్వరరావు పేరు ఉండటం వల్లే పనులు చేయడం లేదా అని ప్రశ్నించారు. నార్ల ఒక ప్రసిద్ధ జర్నలిస్టు, వివిధ పత్రికలకు ఎడిటర్‌గా చేశారని అన్నారు. ఈ పనులు పూర్తికి రూ.10 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. అయితే ఈ ఆడిటోరియం పనులు చాలావరకు పూర్తి అయినందున పిపిపి పద్ధతిలో ఎవరికైనా లీజుకు ఇవ్వాలని ఎమ్మెల్యే మద్దాలి గిరి సూచించారు. పేరు మార్చి అయినా ఆడిటోరియం పనులు చేపట్టాలని మీ పేరైనా పెట్టుకోవాలని టిడిపి కార్పొరేటర్‌ మానం పద్మశ్రీ కోరారు. ఈ ఆడిటోరియం ఇప్పుడు కాదులే... తరువాత ఆలోచిద్దాం అని మేయర్‌ దాటవేశారు. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు. 2153 మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లిస్తున్నామని తెలిపారు. మొత్తం 340 మంది శాశ్వత కార్మికులు, 1813 మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులని అధికారులు తెలిపారు. వీరికి కొబ్బరి నూనె, సబ్బులు, ఇతర వస్తువులు త్వరలో ఇస్తామన్నారు.