Sep 07,2023 20:23

కుమార్తె కులాంతర వివాహం జరిపిస్తున్న ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్‌ రెడ్డి

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ప్రథమ కుమార్తె పల్లవి ప్రేమించిన వ్యక్తితో గురువారం వివాహం జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పవన్‌ కుమార్‌ను తన కుమార్తె ప్రేమించిందని తెలుసుకొని అతని తల్లిదండ్రులతో చర్చించి గురువారం ఉదయం బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేశారు. అనంతరం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని కుమార్తె వివాహాన్ని రిజిస్టర్‌ చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇద్దరు కుమార్తెల్లో ప్రథమ కుమార్తె వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించామని పేర్కొన్నారు. ఆమె ప్రేమించిన అబ్బాయితోనే వివాహం జరిపించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన కుమార్తె చదువుకుంటున్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమిస్తే వారి స్థాయి, కుల మతాలు చూడకుండా తన కుమార్తె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ వారిద్దరికీ వివాహం జరిపించామన్నారు. ప్రతి పిల్లల తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి ఎక్కడైతే వారు సంతోషంగా జీవిస్తారో తెలుసుకొని పిల్లలకు తగినట్లుగా నడుచుకోవాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడి,్డ రాయలసీమ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ సభ్యులు కాకర్ల నాగశేషారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్‌ వరికూటి ఓబులరెడ్డి , ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబ సభ్యులు కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.