ప్రజాశక్తి - క్రోసూరు : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి సంక్షేమ బోర్డు ద్వారా అమలవ్వాల్సిన పథకాలపై అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. తొలుత స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుండి కార్యాలయం వరకు కార్మికులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు 15 ఏళ్లపాటు ఉద్యమించి 1996లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకున్నారని, దాని అమలు కోసం మరో 13 ఏళ్లు పోరాడారని, 2009లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన చట్టాన్ని ప్రస్తుత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 1214 మెమో జారీ ద్వారా సంక్షేమ పథకాలను నిలిపేశారని అన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది భవనిర్మాణ కార్మికులు, పెదకూరపాడు నియోజకవర్గంలో 12 వేల మంది ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమ బోర్డు నుండి రూ.8 కోట్ల పథకాలు నిలిచాయని తెలిపారు. కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డులోని దాదాపు రూ.1400 కోట్ల గాను గత ప్రభుత్వం చంద్రన్న బీమా పేరుతో ఊ.400 కోట్లు తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వం మిగతా మొత్తాన్ని దారిమళ్లించిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన క్లెయిమును సత్వరమే అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, సిహెచ్.యేషియ్య, కె.మల్లికార్జునరావు, బి.కొండలరావు, వెంకటేశ్వర్లు, సోమయ్య, నాగేశ్వరరావు, మీరయ్య, సురేంద్ర నాగమల్లి, బాలకృష్ణ పాల్గొన్నారు.










