ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటన నేపథ్యంలోటిడిపి నాయకుల గృహ నిర్బంధం
ప్రజాశక్తి-మారేడుమిల్లి
రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు మంగళవారం మండల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మండలంలోని టిడిపి నాయకులను గృహ నిర్బంధం చేశారు. మండలానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వస్తున్నారని సమాచారంతో పోలీసులు టిడిపి మండల అధ్యక్షుడు గురుకు శేషు కుమార్‌తో పాటు మరికొంత మందిని హౌస్ అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టిడిపి నేతలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమై గృహ నిర్బంధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టిడిపి నేత గురుకు శేషు కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేస్తుందన్నారు. మండలంలో ఏ ఒక్క రహదారి కూడా వైసిపి ప్రభుత్వం వేయలేదని, గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన రోడ్లకు మరల శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండలంలో చాలామంది గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక్క నిర్మాణం కూడా చేయలేదన్నారు. ఖాళీ కాగితాలను చేతులో పెట్టి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. వర్షాకాలం కావడంతో అనేక గ్రామాల్లో గిరిజనులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టడం లేదన్నారు. గ్రామాల్లో ఎఎన్‌ఎంలు లేకపోవడంతో రోగులకు కనీస వైద్యం అందని పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. మారేడుమిల్లి ప్రధాన ఆరోగ్య కేంద్రంలో కూడా సరైన మందులు లేవని, దీంతో గిరిజనులు బయట ఉన్న ఆర్‌ఎంపి డాక్టర్ల వద్దకు క్యూ కడుతున్నారని తెలిపారు.










