Apr 16,2023 23:42

ఎమ్మెల్యే ధనలక్ష్మిని అడ్డుకొని నిలదీస్తున్న గిరిజనులు, జెఎసి నాయకులు

- బోయ వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చడంపై నిలదీత
- గోబ్యాక్‌ అంటూ నినాదాలు
- రాజీనామా చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

రంప చోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి ఎక్కడికి వెళ్లినా బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చడంపై నిరసన జ్వాలలు ఆమెను తాకుతూనే ఉన్నాయి. మండలం లోని వెలగలపాలెం గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ధనలక్ష్మిని ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన గిరిజనులు మండలంలోని మర్రిపాలెం రహదారిపై అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఎందుకు ఆమోదం తెలియజేశారని, జిఒ 52ను ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. ఆదివాసీలు, గిరిజన సంఘాలు పోరాడుతుంటే గిరిజన ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేకు చీమకుట్టునట్టు కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదివాసీ నేతలు ప్రశ్నించడంతో, బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చడం వల్ల ఏజెన్సీలో గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్యే ధనలక్ష్మి సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే, జెఎసి నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి సిఐ ఎస్‌కె బాజీలాల్‌, జడ్డంగి, రాజవొమ్మంగి ఎస్‌ఐలు షరిఫ్‌, టీజీ నరేంద్ర ప్రసాద్‌, పోలీసు సిబ్బంది ఆదివాసీ నేతలను అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసు చర్యలను గిరిజన నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జెఎసి నాయకులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, వజ్రపు అప్పారావు, గొల్లపూడి పెద్దిరాజు, రాజు, శ్రీను, దాసు, సత్యనారాయణ, గిరిజనులు పాల్గొన్నారు.