ప్రజాశక్తి-అడ్డతీగల:బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ విడుదల చేసిన జిఒ 52ను తక్షణమే రద్డు చేయాలని కోరుతూ శుక్రవారం రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని ఆదివాసీ నాయకులు, గిరిజనులు అడ్డుకున్నారు. ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.., ఎమ్మెల్యే వస్తున్నారని, ఆమె వచ్చిన తరువాత మీరు పూలమాల వేయాలని అక్కడున్న కొంత మంది గిరిజనేతరులు ఆదివాసీ నాయకులతో వాదనకు దిగారు. ఆగ్రహించిన గిరిజన నాయకులు ఆదివాసీ ద్రోహి అయిన ఎమ్మెల్యేకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. గిరిజన హక్కులు తాకట్టుపెట్టడంపై సమాధానం చెప్పిన తర్వాతనే పూలమాల వేయాలని ఆందోళన చేశారు. పోలీసుల సహకారంతో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేస్తుండగా, జెఎసి నాయకులు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులకు జేఏసీ నాయకులకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా లాగి విసిరిపడేశారు. గిరిజన నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అడ్డతీగల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఆదివాసీ ఉద్యమాలను ఆపలేరంటూ గిరిజన నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, గిరిజన సంఘం, ఆదివాసీ జెఎసి నాయకులు టి.బాబురావు, ఇ.సిరిమల్లె రెడ్డి, ఐవి.రమణ, ఎస్.సప్నకుమారి, ఎం.వాణిశ్రీ, వి.నరసన్న దొర, పల్లాల అబ్బాయి రెడ్డి, తామర బాజీ, జర్త కృష్ణారెడ్డి, ఎస్ సత్తిరెడ్డి, కోసూరు శ్రీనివాస్‌రెడ్డి, చెదల దినేష్ రెడ్డి, జర్త వెంకటరమణరెడ్డి, వై వీరభద్రరావు, పందుల కామరాజు, తీగల బాబూరావు, వై.వెంకటరమణ, కురుసం వరలక్ష్మి పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులకు ఖండన
రాజవొమ్మంగి : అడ్డతీగలలో గిరిజన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆదివాసీ జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజవొమ్మంగిలో జరిగిన సమావేశంలో జెఎసి నాయకులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, సింగిరెడ్డి అచ్చారావు, గంపా నాగరాజు మాట్లాడుతూ, అడ్డతీగలలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ తీసుకొచ్చిన 52 జీవోపై ప్రశ్నించిన గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావుతో పాటు మరికొంతమంది జెఎసి నాయకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇటీవల రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో శాంతియుత ఆందోళన చేస్తున్న జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.జగన్నాథం, జి పెద్దిరాజు, వజ్రపు అప్పారావు, బి చిట్టిబాబు, ఎన్ ఎర్రయ్య, ఈ లక్ష్మణ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.










