Apr 06,2023 00:33

రోడ్డుకు అడ్డంగా బైఠాయించిఎమ్మెల్యే ధనలక్ష్మిని ప్రశ్నిస్తున్న ఆదివాసీలు

ప్రజాశక్తి - చింతూరు
బోయ, వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గిరిజన ఎమ్మెల్యేగా ఉండి వ్యతిరేకించకపోవడంపై రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన గిరిజనులు అడ్డుకున్నారు. చింతూరు మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటనకు రాగా, గిరిజనులు ఆమెను అడ్డుకొని నిరసన తెలిపారు. తక్షణమే అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బోయ, వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఆదివాసీ ఎమ్మెల్యేగా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఆదివాసీల భవిష్యత్తును నాశనం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారా? అని నిలదీశారు. వెంటనే జిఒ 52ను రద్దు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు సున్నం వెంకట రమణ, జల్లి నరేష్‌, మడివి రాజు, సురేష్‌, సంకురమ్మ తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాన్ని రద్దు చేయాలని ప్రజాప్రతినిధుల వినతి
బోయ, వాల్మీకి, బొంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మికి చింతూరు మండల సర్పంచులు, ఎంపిటిసిలు, ఇతర ప్రజాప్రతినిధులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాల్లో తాము పర్యటిస్తున్న సమయంలో ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి బొంతు ఒరియాలను చేర్చటంపై గిరిజనులు తమను నిలదీస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.