ప్రజాశక్తి - విఆర్.పురం
బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిను గిరిజన సంఘం, ఆదివాసీ జెఎసిల ఆధ్వర్యంలో గురువారం గిరిజనులు, గిరిజన ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. మండల కేంద్రమైన రేఖపల్లిలో ఆసరా పథకంపై తలపెట్టిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధనలక్ష్మి వచ్చారు. ఆమెను ప్రధాన కూడలి వద్ద గిరిజనులు అడ్డగించి 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ పెద్దపెట్టున నినదించారు. బోయ/వాల్మీకిలను, బెంతో ఒరియాలను ఎస్‌టి జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై మీతో సహా ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలూ ఇంత వరకూ ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. ఇతరులను ఎస్‌టి జాబితాలో చేర్చితే నిజమైన గిరిజనులు విద్య, ఉపాధి సహా అన్నింటా అన్యాయానికి గురవుతారన్నారు. గిరిజనుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకున్నారు. అనంతరం రేఖపల్లి కూడలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపిపి కారం లక్ష్మి, జెడ్‌పిటిసి వాళ్ళ రంగారెడ్ది, గిరిజన సంఘం నాయకులు పులి సంతోష్ కుమార్, ఎంపిటిసి పూనం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేసేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా తీర్మానం చేస్తున్నప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ప్రజా ప్రతినిధులు పి.సరోజిని, కారం బుచ్చమ్మ, సవలం మారయ్య, వేటి లక్ష్మి, పాయం లక్ష్మణరావు, కారం సుందరయ్య, పొడియం శ్రీరామూర్తి, చిక్కాల రామారావు, వాళ్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.










