- గోబ్యాక్ అంటూ హారెత్తిన నినాదాలు
- బోయ, వాల్మికిలను ఎస్‌టి జాబితాలో చేర్చడంపై రాజీనామా చేయాలని డిమాండ్
ప్రజాశక్తి-కూనవరం
బోయ వాల్మికిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఎటువంటి అభ్యంతరం తెలపని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మికి గిరిజనుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మంగళవారం మండలంలోని కోతులగుట్ట గ్రామంలో వైఎస్‌ఆర్ ఆసరా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే ధనలక్ష్మిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిఒ నెంబర్ 52ను రద్దు చేయాలని ఆదివాసీ జెఎసి, గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదిమకాలం నుండి ఎటువంటి గిరిజన ఆనవాళ్లు లేని కులాలను ఎలా ఎస్‌టి జాబితాలో కలుపుతారని ప్రశ్నిచారు. వేరే కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతుంటే ఒక ఆదివాసీ ఆడపడుచు అయి ఉండి ప్రభుత్వానికి తమ గోడు చెప్పలేరా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీర్మానాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆదివాసీల పోరాటానికి బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవితేజ, గిరిజన సంఘం నాయకులు బాబు బొర్రయ్య, ఆదివాసీ జేఏసీ నాయకులు కుంజా అనిల్ కుమార్, పాయం సీతారామయ్య, తెల్లం తమ్మయ్య, కారం రవి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.










