
ప్రజాశక్తి -మునగపాక రూరల్
మండలంలోని గవర్ల అనకాపల్లి గ్రామంలో యలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తి రాజు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు ఆళ్ల మహేశ్వరరావుతో కూడిన బృందం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గవర్ల అనకాపల్లి ఆవ కాలువపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయి పదేళ్లు కావస్తున్న నేటికీ అప్రోచ్ రోడ్డు వేయలేదన్నారు. దీంతో నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. అనకాపల్లి బైపాస్ నుండి తోటాడ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టి ప్రమాదాలను అరికట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం నిర్మించాలని, అసంపూర్తి వదిలేసిన రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురిసినప్పుడు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నామని, బిల్డింగ్, ప్రహరీ నిర్మించాలని, మురుగునీటి కాలువల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెంటకోట జోగినాయుడు, కాండ్రేగుల రాము, వైసిపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.