Aug 21,2023 22:56

వినతిపత్రం అందజేస్తున్న నిర్వాసితులు

ప్రజాశక్తి- మెళియాపుట్టి: మండలంలో చీపురుపల్లి ఆఫ్‌షోర్‌ నిర్వాసిత గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారానికి అందలేదని ఉప సర్పంచ్‌ పిట్ట సవరయ్య, నిర్వాసితులు ఎమ్మెల్యేకు విన్నవించారు. గ్రామంలో 24 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. అంతకుముందు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.సరోజని, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు యు.బాలరాజు,సర్పంచ్‌ యవ్వరి ఈశ్వరరావు, తెంబూరు ప్రసాదరావు, రామకృష్ణ, బాలరాజు, ఎస్‌ఐ టి.రాజేష్‌ పాల్గొన్నారు.
జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం
మెళియాపుట్టిలోని వెలుగు కార్యాలయంలో ఐటిడిఎ ఆధ్వర్యాన జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం ప్రారంభించారు. రూ.15 లక్షలతో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎపిఎం లలిత తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. స్థానిక మహిళలతో కలిసి సిఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడపిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉల్లాన బాలరాజు, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంపిటిసి ప్రతినిధి జైమునిరావు పాల్గొన్నారు.