పాడేరు: మండలంలోని మోదాపల్లి పంచాయతీ కాంగెడ్డ, కారెబండ గ్రామాల్లో శనివారం వైసీపీ గడప గడప కార్యక్రమానికి హాజరైన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి నిరసన సెగ తగిలింది. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెడితే ఎందుకు మౌనం వహించారని గిరిజన సంఘం నాయకులు ప్రశ్నించారు . గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, నాయకులు ఎల్.సుందరరావు , ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్నారావు, సూరిబాబు, గ్రామస్థులు రహదారిపై బైఠాయించారు. ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, మాట్లాడుతూ, బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఆదివాసీలు అన్యాయమైపోతారన్నారు.పార్టీ మేనిఫెస్టోలో బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చినందున, ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీలో వ్యతిరేకతపై మళ్లీ తమ వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని ఆమె చెప్పారు. అయినా మిమ్మల్ని నమ్మబోమని గిరిజన సంఘం నాయకులు ఎమ్మెల్యే కారుకి అడ్డంగా నిలబడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని నాయకులను అడ్డగించి ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రాజు, భాస్కరరావు, బాలరాజు, లోకేష్, మత్య్సరాజు పాల్గొన్నారు.










