Jul 21,2023 23:36

సమావేశంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ: ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కేసులో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూము లను ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవిన్యూ పరిధిలోని జాలలపాలెం వద్ద 175 ఎకరాల కుంట, చెరువు, అడవి, చాకిరిదారుల మాన్యాలు, ప్రభుత్వ అసైన్డ్‌ భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఆక్ర మించిన ప్రభుత్వ భూములను జగనన్న కాలనీ నిమిత్తం ప్రభుత్వానికే అమ్మి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపిం చారు. ల్యాండ్‌ ఎక్విజిషన్‌లో ప్రభుత్వానికి పట్టా భూముల రికార్డులు చూపించారని, భూమి పొజిషన్‌ మాత్రం ప్రభుత్వ భూములను చూపించారని ఆరోపించారు. వాటిలో ప్రస్తుతం జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు ఉన్నాయని ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వినుకొండ పట్టణ ప్రజలకు ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో 120 ఎకరాలు భూమి కేటాయించి ప్రభుత్వానికి అమ్మి కోట్లు దిగమింగి పట్టణ, పేద ప్రజలను బ్రహ్మ నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్డులో పసుపులేరు బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే కొనుగోలు చేసిన 100 ఎకరాల్లో 62 ఎకరాలు ప్రభుత్వ చుక్కల భూములు ఉన్నాయని, నూజెండ్ల మండలంలో కూడా బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లతో సొంతం చేసుకున్నారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ భూములను పంచాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేసే బ్రహ్మనాయు డుకి ప్రజా కోర్టులో శిక్ష ఖాయమని అన్నారు.