గడప గడపలో గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నిరసన
ప్రజాశక్తి -నక్కపల్లి : మత్స్యకార గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాబూరావుకు నిరసన సెగ తగులుతోంది. మంగళవారం పెదతీనార్ల మత్స్యకార గ్రామంలో ఎమ్మెల్యే బాబూరావు పర్యటించారు. ఆయన గ్రామంలోకి అడుగుపెట్టగానే ఎమ్మెల్యేను నిలదీసేందుకు మత్స్యకారు నాయకులు ఎంపిటిసి మేరిగి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గోసల తాతారావు , జనసేన పార్టీ యువత సిద్దపడ్డారు. పెదతీనార్లలో ఎమ్మెల్యే పర్యటనకు నిరసన సెగ తగులుతుందని గుర్తించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ నారాయణరావు, ఎస్‌ఐలు శిరీష, ప్రసాదరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
హెటెరో కంపెనీ వల్ల మత్స్యసంపద నాశనమవుతోందని, మత్స్యకారుల జీవనోపాధి, ఉనికి దెబ్బతింటోందని 343 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి పట్టడం లేదని నినదించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని , రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే బాబూరావు వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులు, మత్స్యకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గోబ్యా క్, డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.










