Nov 08,2022 00:04

నిలదీస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో కాలుష్యంపై ఈ ప్రాంత మత్స్యకారులంతా ఐక్యంగా వస్తే ధర్నా చేద్దామని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని పెద తీనార్ల పంచాయతీ శివారు దొండవాక గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే బాబురావు గ్రామంలో పర్యటిస్తుండగా జనసేన పార్టీకి చెందిన పలువురు యువకులు నిరసన గళం వినిపించారు. హెటేరో కాలుష్యం, గ్రామంలో సమస్యల పైన ఎమ్మెల్యే బాబురావు దృష్టికి తీసుకువచ్చే సమయంలో నాయకులు, పోలీసులు, జనసేన పార్టీ నాయకుల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జనసేన పార్టీకి చెందిన యువకులు ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సిఐ నారాయణరావు, ఎస్‌ఐ శిరీష జనసేన యువకులను వారించారు. అనంతరం జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మైలపల్లి గిరీష్‌ తదితరులు ఎమ్మెల్యే తో మాట్లాడి సమస్యలను విన్నవించారు. హెటిరో కాలుష్యం కారణంగా అనేకమంది వ్యాధులను బారిన పడుతున్నారని, పలువురు మీత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, హెటిరో కాలుష్యంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మైలపల్లి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు శీరం నరసింహమూర్తి, తాతారావు, ఏరిపిల్లి నాగేష్‌, కొర్లయ్య, జనసేన నాయకులు పిక్కి స్వామి తదితరులు పాల్గొన్నారు.