Feb 26,2023 00:23

ఆహ్వాన పత్రికను ఇస్తున్న ప్రధాన అర్చకులు


ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న కళ్యాణ ఉత్సవ ఆహ్వాన పత్రికను శనివారం ఎమ్మెల్యే బాబురావుకు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌ ఆచార్యులు, సిబ్బంది కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు కల్యాణోత్సవాలకు సంబంధించి దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాదములు అందజేయాలన్నారు. కల్యాణోత్సవంలో చేపట్టే పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. మార్చి 3న జరిగే వార్షిక కళ్యాణోత్సవాలకు భక్తులు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీరం నరసింహమూర్తి, కొల్లాటి బుజ్జి, రవితేజ పాల్గొన్నారు.