Oct 19,2022 22:40

వైసిపి నేత అక్రమ క్వారీని పరిశీలిస్తున్న బండారు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
ప్రజాశక్తి- పెందుర్తి:
మండలంలోని ఎస్‌ఆర్‌ పురంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అండదండలతోనే గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బుధవారం ఎస్‌ఆర్‌.పురం సర్వేనెంబర్‌ 100లో ఎటువంటి అనుమతులు లేకుండా వైసిపి నేత జయరాజ్‌ నిర్వహిస్తున్న అక్రమ క్వారీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుంఆ పోయిందని మండిపడ్డారు. ఎంపిపి నాగమణి అడ్డుకొని డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేంతవరకు అక్రమ క్వారీలపై అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు చేయాల్సిన పనులను ప్రజాప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగాకే ఒక్కో లారీ, జెసిబిని సీజ్‌ చేశారన్నారు. స్థానిక తహశీల్దార్‌, విఆర్‌ఒలకు అక్రమ క్వారీలు కనిపించడం లేదాయని మండిపడ్డారు.
గతంలోనూ ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట భారీ అక్రమాలే జరిగాయని, ఎకరానికి రూ.68లక్షలు చెల్లించినట్టు అప్పటి తహశీల్దార్‌ రామారావు ప్రకటిస్తే, రైతులకు అందినది కేవలం రూ.30లక్షలేనని,మిగతా నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ కోరుతూ ఫిర్యాదు చేస్తే 16నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చలనం, చర్యల్లేవన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కరక దేవుడు, మాజీ జెడ్‌పిటిసి రెడ్డి నారాయణరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.