Sep 24,2022 23:31

అదీప్‌రాజుకు వ్యతిరేకంగా నినదిస్తున్న పలువురు వైసిపి కార్యకర్తలు

ప్రజాశక్తి-పెందుర్తి: పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజుకు జివిఎంసి 96వ వార్డులో నిరసన సెగ తగిలింది. శనివారం ఉదయం పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జివిఎంసి నిధులు రూ.4.80 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్‌ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే అదీప్‌రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 96వ వార్డులో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా కూర్చుని అదీప్‌రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినదించారు. 96వ వార్డులోని పార్వతీనగర్‌ కాలనీ, ఆదిత్యనగర్‌ కాలనీ, ఎల్‌ఐసి కాలనీలో ఎమ్మెల్యే కార్యక్రమాలను వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అదీప్‌ రాజును అధిక మెజార్టీతో గెలిపించిన పార్టీ రూరల్‌ జిల్లా అద్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడుకు గానీ, తమకు గానీ కనీసం సమాచారం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులతో కుమ్మకై 96వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం దారుణమని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా ఒక్కసారి కూడా ఇక్కడకు ఎమ్మెల్యే రాలేదని విమర్శించారు. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని నిరసనకారులను అడ్డు తొలగించడంతో ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి టిడిపి ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, జోనల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.
పార్టీ కోసం పనిచేస్తాం
పార్టీ కోసం తాము ఎప్పుడూ కష్టపడి పనిచేస్తామని వైసిపి సీనియర్‌ నాయకులు శరగడం చిన అప్పలనాయుడు అన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నుంచి నేటి సిఎం జగన్మోహన్‌రెడ్డి వరకు తనకు మంచి అనుబంధం ఉందన్నారు.