Mar 09,2023 23:25

ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లు, మెటీరియల్‌ను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-పాడేరు: ఈ నెల 13న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల శాసనమండలి నియోజక వర్గ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాలలో ఈ ఎన్నికకు సంబంధించి 15 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసారు. 11 మండలాలలో 11 పోలింగ్‌ కేంద్రాలతో పాటు హుకుంపేట, జి.కే వీధి, పాడేరు, అరకులలో అదనంగా ఒక్కో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసారు. జిల్లాలో పురుష ఓటర్లు 7861 మంది, మహిళా ఓటర్లు 3661 మంది నమోదు చేసుకోగా ముగ్గురు ఇతర ఓటర్లతో కలిపి 11525 ఓటర్లు నమోదు అయ్యారు.
జిల్లాలో అత్యధికంగా 1714 మంది హుకుంపేట మండలం కాగా అత్యల్పంగా 440 మంది జి.కే.వీధి మండలంలో ఓటర్లు ఉన్నారు.పోలింగ్‌ కేంద్రాల వారిగా పరిశీలిస్తే పెదబయలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాటశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో అత్యధికంగా 1186 మంది, జి.కే.వీధి మండలం అప్పర్‌ సీలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో అత్యల్పంగా 56 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఈ 11 మండలాలను సౌకర్యార్ధం ఐదు జోన్లు, ఐదు రూట్లుగా విభజించడం జరిగింది.జోన్‌-1 రూట్‌ 1 ఫరిదిలో హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు లోయ, అనంతగిరి మండలాలు, జోన్‌-2 రూట్‌ 2 పరిదిలో పెదబయలు, ముంచింగిపుట్టు, జోన్‌-3 రూట్‌ 3 ఫరిదిలో చింతపల్లి, కొయ్యూరు, జోన్‌-4 రూట్‌ 4 ఫరిదిలో జి.కే. వీధి, జోన్‌-5 రూట్‌ 5 ఫరిదిలో పాడేరు, జి.మాడుగుల మండలాలు ఉన్నాయి.
ఇప్పటికే బ్యాలెట్‌ పేపర్లతో సహా ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పెట్టెలు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసేప్సన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.12వ తేదీ ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుండి ఎన్నికల సిబ్బందిని, మెటీరియల్‌ను సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.13వ తేదీ సాయంత్రం పోలింగ్‌ అనంతర మెటీరియల్‌ తీసుకోవడానికి కుడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంకు సీల్డ్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు చేరవేసే వరకు తలారిసింగి పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచి ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించటానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.